Nua-O scholarship: ఇకపై విద్యార్థులకు ఏటా ₹9వేలు.. ఒడిశా సర్కార్‌ కొత్త పథకం

డిగ్రీ, పీజీ చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం కొత్త పథకం అమలుచేయనుంది.

Published : 13 Feb 2024 18:26 IST

(ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌)

భువనేశ్వర్‌: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా రూ.9వేలు, విద్యార్థినులకు రూ.10వేలు చొప్పున అందించనున్నారు. ఎస్సీ/ఎస్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే  రూ.10వేలు, విద్యార్థినులైతే రూ.11వేలు చొప్పున అందిస్తారు. జజ్‌పుర్‌లో నిర్వహించిన నువా ఓ ఫెస్టివల్‌లో 5టి ఛైర్‌పర్సన్‌ వీకే పాండియన్‌ మాట్లాడుతూ.. సీఎం అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

‘6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్‌’: సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు

నూతన ఉన్నత అభిలాష (NUA) -ఒడిశా పేరిట అమలు చేసే ఈ పథకం ద్వారా యువతకు నిరంతరం నైపుణ్యాలు కల్పించి కొత్త అవకాశాలతో సాధికారత సాధించేందుకు కృషిచేయడమే లక్ష్యమన్నారు.  2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.385 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం 30 జిల్లాల్లో అమలు చేయనున్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.  రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలోని సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుందని పాండియన్‌ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చెల్లించడం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైతే వారు స్కాలర్‌షిప్‌కు అనర్హులని వెల్లడించారు.  ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన Nua-O స్కాలర్‌షిప్ నగదును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 4.5లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, 32వేల మంది పీజీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని