Omar Abdullah: గతంలో ఎన్నడూ గుల్‌మార్గ్‌ను ఇలా చూడలేదు: మాజీ సీఎం

జమ్మూ కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో వాతావరణ మార్పులపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 10 Jan 2024 13:53 IST

శ్రీనగర్‌: వెండి కొండల్లా మెరిసిపోయే గుల్‌మార్గ్‌ (Gulmarg)లో మంచు మాయం కావడంపై  జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir) మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇక్కడ ఇలాంటి పరిస్థితి చూడలేదని.. 2022, 2023లో ఒకే తేదీన దిగిన ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘శీతాకాలంలో గుల్‌మార్గ్‌లో ఇంతటి పొడి వాతావరణం ఎన్నడూ చూడలేదు. ఈ పరిస్థితిని వివరించేందుకు గత రెండేళ్లలో జనవరి 6వ తేదీన దిగిన ఫొటోలను షేర్‌ చేస్తున్నా. త్వరలో మంచు కురవకపోతే వేసవి మరింత దుర్భరంగా ఉంటుంది. నాలాగే మంచులో స్కీయింగ్ చేయాలనుకునే వారు ఎక్కువ కాలం వేచి ఉండలేరు. మంచు లేకపోతే వాళ్లకు ఇక్కడ ఏమీ లేనట్లే’’ అని ట్వీట్ చేశారు.

జమ్మూ కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ శీతాకాలం ఆటలకు ప్రసిద్ధి. ఈ సీజన్‌లో ఎక్కువ మంది పర్యాటకులు  స్కీయింగ్‌ చేసేందుకు వస్తుంటారు. కొంత కాలంగా హిమాలయాల్లో సంభవిస్తున్న వాతావరణ మార్పులతో ఇక్కడ మంచు మాయం అవుతోంది. సాధారణంగా శీతాకాలంలో హిమాలయాల్లో 40 అడుగుల మేర మంచు పేరుకుపోతుంది. కానీ ఈసారి ఆ స్థాయిలో కురవలేదు. గుల్‌మార్గ్‌, పహల్గామ్‌ ప్రాంతాలతోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు చోట్ల ఈ ఏడాది సాధారణ స్థాయిలో హిమపాతం నమోదు కాకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని