Google Doodle: ఈరోజు గూగుల్‌ డూడుల్‌ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?

Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..!

Updated : 22 Apr 2024 12:11 IST

Google Doodle | ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు గూగుల్‌ డూడుల్‌ పరిశీలించారా? ధరిత్రి దినోత్సవం (Earth Day) సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకంగా రూపొందించిన ఈ డూడుల్‌ (Google Doodle) అందరినీ ఆకర్షిస్తోంది. అవి చూడ్డానికి ఫొటోల్లాగే కనిపిస్తున్నా.. వాటిలో ‘G O O G L E’ అనే అక్షరాలు దాగి ఉన్నాయి. తీక్షణంగా గమనిస్తే అవి కనిపిస్తాయి. అయితే, అవి ఫొటోషాప్‌లో ఎడిట్‌ చేసిన చిత్రాలు కాదు. అలాంటి ప్రదేశాలు నిజంగానే భూమిపై ఉన్నాయి.

ధరిత్రి దినోత్సవం (Earth Day) సందర్భంగా వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో గుర్తుచేసేలా గూగుల్‌ (Google) ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.ఒక్కో అక్షరం ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోంది. అవి ఏళ్లుగా ఎలాంటి మార్పులకు లోనయ్యాయో శాటిలైట్‌ చిత్రాల ద్వారా యానిమేషన్‌ను కూడా జోడించింది. డూడుల్‌పై క్లిక్‌ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి.

  • G: ఆంగ్ల అక్షరం ‘జీ’ని పోలి ఉన్న తొలి చిత్రంలోని ప్రదేశం టర్క్స్‌ అండ్‌ కైకోస్‌ దీవులు. అట్లాంటిక్‌ మహాసముద్రంలోని ఈ ప్రాంతం అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా నిలుస్తోంది. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉంది.
  • O: మెక్సికోలోని స్కార్పియన్‌ రీఫ్‌ నేషనల్‌ పార్క్‌. యునెస్కో గుర్తింపు పొందిన ఈ జీవావరణ కేంద్రం కీలక పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న అనేక పక్షులు, తాబేళ్లకు ఇది కేంద్రం.
  • O: ఐస్‌లాండ్‌లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్‌కు సంబంధించిన చిత్రం. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం.. అగ్నిపర్వతాలు, మంచు మిశ్రమంతో అరుదైన ప్రకృతి దృశ్యాలు, వృక్షజాలానికి నెలవు.
  • G: ఇది బ్రెజిల్‌లోని జౌ నేషనల్‌ పార్క్‌. అమెజాన్‌ అడవుల మధ్యలోని ఈ ప్రాంతం అనేక అరుదైన జంతువులకు నివాసం.
  • L: డూడుల్‌లో ‘ఎల్‌’ను సూచిస్తున్న ఈ ప్రాంతం నైజీరియాలోని గ్రేట్‌ గ్రీన్‌వాల్‌. ఎడారికీకరణ వల్ల ఈ ప్రాంతం కోల్పోయిన వైభవాన్ని మొక్కలు నాటడం ద్వారా పునరుద్ధరిస్తున్నారు. ఇది స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది.
  • E: ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్‌ నేచర్‌ రిజర్వ్స్‌కు సంబంధించిన చిత్రం ‘ఈ’ అక్షరాన్ని పోలి ఉంది. ఈ ప్రాంతం అనేక సముద్ర తాబేళ్లు, పక్షులు సహా పలు జీవులకు ఆలవాలం.

ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు వివిధ సంస్థలు, స్థానికులు కలిసి చేస్తున్న కృషిని గుర్తిస్తూ గూగుల్‌ (Google) ఈ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని