GST Dues: నిర్మల vs అధీర్‌.. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై లోక్‌సభలో రగడ

జీఎస్టీ చెల్లింపుల అంశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Updated : 05 Feb 2024 16:07 IST

దిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో (Union Budget 2024) భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman), కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధరి (Adhir Ranjan Chowdhury)ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జీఎస్టీ వాటాను విడుదల చేయకుండా భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని అధీర్‌ విమర్శించారు. దక్షిణ భారతదేశంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై సీతారామన్‌ స్పందిస్తూ.. ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే నిధులు విడుదలవుతాయని, ఇష్టానుసారం కుదరదని స్పష్టంచేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక సామర్థ్యంపై లోక్‌సభలో సోమవారం చర్చ జరిగింది. 

ఈసందర్భంగా అధీర్‌ రంజన్‌ మాట్లాడుతూ.. భాజపాయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పెద్దమొత్తంలో పెండింగ్‌ ఉన్నాయన్నారు. దీనికి కర్ణాటకే ఉదాహరణ అని చెప్పారు. అక్కడ భాజపా అధికారంలో ఉన్నంతవరకు ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లింపులు చేసేవారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. 2024 మధ్యంతర బడ్జెట్‌లోనూ కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను ఈసందర్భంగా ఆయన ప్రస్తావించారు. నిధులు విడుదల చేయకపోవడంతో 15వ ఆర్థికసంఘం కింద ఆ రాష్ట్రానికి రూ.11 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సభకు వివరించారు. దీనిపై బుధవారం దిల్లీలో కాంగ్రెస్‌ నేతలు ధర్నా కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. 

దీనిపై సీతారామన్‌ స్పందిస్తూ.. తన ఇష్టప్రకారం కాకుండా ఆర్థికసంఘం సిఫార్సుల మేరకే నిధుల కేటాయింపు జరుగుతుందని అధీర్‌ అర్థం చేసుకోవాలన్నారు. ఎస్‌జీఎస్టీ (SGST) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుందని, సీజీఎస్టీ (CGST) మాత్రం ఆర్థికసంఘం సలహామేరకు విభజిస్తామని చెప్పారు. జీఎస్టీ వాటా విడుదలలోనూ దాని సిఫార్సులే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అంతేతప్ప ఎలాంటి రాజకీయాలకు తావుండదని స్పష్టంచేశారు. ‘‘ ఆరు నెలల క్రితం వరకు కర్ణాటకలో అంతా సజావుగా సాగిందని అధీర్‌ చెబుతున్నారు. అందులో తప్పేముంది. చేయాల్సిన వాటిపై కాకుండా.. వేరే వాటిపై ఖర్చు చేసి.. బకాయిలు రాలేదంటే ఎలా? మీరే తప్పు చేసి.. దానిని కేంద్రంపై నెట్టివేయడం సరికాదు.’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. మధ్యమధ్యలో అధీర్‌ రంజన్‌ కలగజేసుకుంటుండగా... ‘ఆర్థిక సంఘం చెప్పనిదే నేనేం చేయలేను. నాకు విచక్షణ లేదనుకోవద్దు. ఇంకేమైనా కావాలనుకుంటే ఆర్థిక సంఘంతో మాట్లాడుకోండి’ అంటూ కోపంగా తన సీట్లో కూర్చుండిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని