Lok sabha Elections: భారత ఎన్నికలపై కోవర్ట్‌ ఆపరేషన్‌.. ఓపెన్‌ఏఐ సంచలన నివేదిక

లోక్‌సభ ఎన్నికలపై ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ ఒకటి కోవర్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించిందని, దాన్ని తాము అడ్డుకున్నట్లు ఓపెన్‌ ఏఐ సంస్థ వెల్లడించింది.

Published : 01 Jun 2024 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరిన వేళ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ సంస్థ (OpenAI) సంచలన విషయాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన STOIC అనే సంస్థ భాజపా వ్యతిరేక అజెండాతో లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నించిందని పేర్కొంది. పెద్దఎత్తున ప్రజల అభిప్రాయాలను మార్చాలని ప్రయత్నించిందని పేర్కొంది. తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని ఓపెన్‌ ఏఐ తెలిపింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో వెబ్‌ ఆర్టికల్స్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో కామెంట్ల ద్వారా భారత ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ప్రజాభిప్రాయాన్ని భాజపాకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించిన 24 గంటల్లోనే తాము గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఆదిలోనే అడ్డుకట్ట పడిందని పేర్కొంది. ఎక్స్‌, మెటా వంటి వేదికలు కూడా ఆయా అకౌంట్లను తొలగించాయని పేర్కొంది. దీంతో ఈ క్యాంపెయిన్‌ ప్రభావం పరిమితమేనని తెలిపింది.

ఓపెన్‌ఏఐ నివేదికపై ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటివి ప్రమాదకరమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు దేశంలోనూ, వెలుపల ఈ తరహా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ నివేదికను ఇంకాస్త ముందుగా వెలువరించాల్సి ఉండేదని, ఇప్పటికే ఎన్నికలు తుది దశకు చేరాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని