Bhagwant Mann: కల్తీ మద్యం మరణాల వేళ.. సీఎం సింగింగ్ వీడియో వైరల్‌

పాటలు పాడుతున్న తన వీడియో వెలుగులోకి రావడంతో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌(Bhagwant Mann)పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. 

Published : 21 Mar 2024 18:04 IST

చండీగఢ్‌: కల్తీ మద్యం తాగడంతో పంజాబ్‌ (Punjab)లోని సంగ్రూర్ నియోజకవర్గంలోని దిర్భా ప్రాంతంలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పాట పాడుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దాంతో విపక్ష పార్టీలు కాంగ్రెస్‌, భాజపా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఆ వీడియోలో ఒక కారులో భగవంత్‌ మాన్(Bhagwant Mann).. గాయకులు సుఖ్వీందర్‌ సింగ్, బబ్బూ మన్‌తో కలిసి పాటలు పాడినట్లు కనిపిస్తోంది. ఆ దృశ్యాలను భాజపా పంజాబ్‌ అధ్యక్షుడు సునీల్ జాఖడ్ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. సొంత నియోజకవర్గంలో కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతుంటే సీఎం పాటలు పాడుతున్నారు. నాయకుడు లేని రాష్ట్రం చుక్కాని లేని పడవ వంటిది. అది నిజం’ అని తీవ్ర విమర్శలు చేశారు. ‘కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. ఘటనా స్థలం సీఎం సొంత జిల్లాలోనిది. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో ఆప్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది’ అని కాంగ్రెస్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా మండిపడ్డారు.

2022లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు వరకు భగవంత్ మాన్ సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై తాము దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 2023లో కూడా సంగ్రూర్‌లో ఇదేతరహా ఘటన జరిగింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని