Twitter: భారత్‌లో 23 లక్షల ట్విటర్‌ హ్యాండిల్స్‌ బ్లాక్‌

భారత్‌లో జూన్‌, జులై నెలల్లో 23 లక్షల ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు ట్విటర్‌ వెల్లడించింది.

Updated : 12 Aug 2023 20:59 IST

దిల్లీ: నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విటర్‌ (ప్రస్తుత X) కఠిన చర్యలకు దిగుతోంది. జూన్‌- జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 హ్యాండిల్స్‌ని బ్లాక్‌ చేసినట్లు తాజాగా ట్విటర్‌ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా పోస్టులు చేసిన ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు మే 26 నుంచి జూన్‌ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 హ్యాండిల్స్‌ని ట్విటర్‌ బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న 1,772 అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో జూన్‌ 26 నుంచి జులై 25 మధ్య కాలంలోనే 18,51,022 హ్యాండిల్స్‌ని బ్లాక్‌ చేసినట్లు ట్విటర్‌ అప్పట్లో పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న 2,865 అకౌంట్లను బ్లాక్‌ చేసినట్లు వెల్లడించింది. భారత్‌ తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాలకు అనుగుణంగా ట్విటర్‌ ప్రతి నెలా సమ్మతి నివేదికలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే అనైతిక చర్యలకు పాల్పడుతున్న వినియోగదారులపై తీసుకున్న చర్యలను, వినియోగదారుల ఫిర్యాదులకు తాము చూపించిన పరిష్కారాలను వివరిస్తూ ప్రతి నెలా నివేదికను విడుదల చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని