Republic Day: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు తొలిసారి 40మంది మురికివాడల్లో చిన్నారులు!

రిపబ్లిక్‌ డే వేడుకల్లో తొలిసారి మురికివాడల్లోని చిన్నారులు పాల్గొననున్నారు. యూపీలోని లఖ్‌నవూలో బెగ్గర్‌ టు ఎడ్యుకేషన్‌ అనిరాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించనున్నారు.

Updated : 23 Jan 2024 16:34 IST

లఖ్‌నవూ: గణతంత్ర వేడుకల(Republic Day Celebrations)కు భారతావని సిద్ధమైంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రిపబ్లిక్‌ డే వేళ దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించే సైనిక పరేడ్‌.. మన సైనికుల పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పనుంది. రిపబ్లిక్‌ డే వేడుకల పరేడ్‌లో మురికివాడల్లోని చిన్నారుల్ని భాగస్వాముల్ని చేయాలన్న యూపీ అధికారుల నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది. లఖ్‌నవూలో ఈసారి 11-18 ఏళ్ల వయసు కలిగిన 40మంది చిన్నారులతో ప్రదర్శన చేయించనున్నారు. ఈ చిన్నారులు ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేసి జీవితం గడిపినవారే. వీరంతా ‘బెగ్గర్‌ టు ఎడ్యుకేషన్‌’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించనున్నారు.

ఈ అంశంపై లఖ్‌నవూ మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ మాట్లాడారు. మురికివాడల్లో ఉండే చిన్నారులకు దేశంలోనే తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం 40మందికి పైగా చిన్నారులు రిహార్సల్స్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్ స్మైల్‌’ కార్యక్రమం వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఈ చిన్నారుల్ని  భిక్షాటన నుంచి విముక్తి కలిగించి వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేలా చేసిందని తెలిపారు. ఈ పిల్లలతో కలిసి తాము ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వీరందరికీ విద్యనందించి పాఠశాలలతో అనుసంధానం చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.  ఇప్పుడు వీరందరినీ పరేడ్‌ ప్రాక్టీస్‌కు తీసుకొస్తుండటంతో వారికి కొత్త అనుభవాలతో పాటు విశ్వాసం కూడా పెరుగుతుందన్నారు. 

‘ప్రాజెక్టు స్మైల్‌’లో కీలక పాత్ర పోషించిన ‘ఉమీద్‌’ అనే ఎన్జీవోకు చెందిన ప్రతినిధి బల్బిర్‌ సింగ్‌ మాన్‌ మాట్లాడుతూ.. తొలుత ఈ పేద పిల్లలు డబ్బుల కోసం భిక్షాటన చేసేవారని గుర్తుచేశారు. కానీ, గతేడాది కాలంగా వీరికి విద్యనందిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు వీరంతా పూర్తి విశ్వాసంతో రిపబ్లిక్‌డే వేడుకల పరేడ్‌లో పాల్గొంటున్నారన్నారు. 

ప్రాజెక్టు స్మైల్‌.. మా జీవితాన్నే మార్చేసింది!

ప్రాజెక్టు స్మైల్‌ తమ జీవితాలనే మార్చేసిందని పలువురు చిన్నారులు పేర్కొంటున్నారు. జనవరి 26 పరేడ్‌లో పాల్గొనబోతున్నందుకు ఆనందం వ్యక్తంచేశారు. భిక్షాటన చేసిన తాము రిపబ్లిక్‌డే పరేడ్‌లో భాగస్వాములవుతుండటం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో అందరి ముందు ఇలా ప్రదర్శన ఇస్తామని కలలో కూడా ఊహించలేదంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని