Lok Sabha polls: జాతీయ పార్టీల ప్రస్థానం .. అప్పట్లో 14.. ఇప్పుడు 6

ఏడు దశాబ్దాల కాలంలో కొత్తగా వందల పార్టీలు పుట్టుకురాగా.. మరికొన్ని మాత్రం ఉనికిలో లేకుండా పోయాయి. ప్రస్తుత 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు బరిలో నిలిచాయి.

Updated : 21 Mar 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో 53 రాజకీయ పార్టీలు బరిలో నిలిచాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 2,500 (గుర్తింపు పొందని వాటితో కలిపి)కు చేరింది. ఈ క్రమంలో జాతీయ పార్టీల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వచ్చింది. మొదట్లో 14 జాతీయ పార్టీలుంటే ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. ఇక ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఆవిర్భావం నుంచి విలీనం వరకూ వీటి ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. దేశంలో కొత్తగా వందలాది రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినా.. చాలావరకు ఉనికిలో లేకుండా పోయాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు మాత్రమే బరిలో నిలిచాయి.

53 పార్టీలతో మొదలై..

1951-52లో మొదటి సాధారణ ఎన్నికల సమయంలో 53 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. అందులో 14 జాతీయ పార్టీలు కాగా మిగతావి రాష్ట్ర పార్టీలుగా పరిగణించారు. తొలి ఎన్నికలకు ముందు దాదాపు 29 రాజకీయ పార్టీలు తమకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. చివరకు అందులో కేవలం పద్నాలుగింటికి మాత్రమే జాతీయ హోదా కల్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. చివరకు ఎన్నికల ఫలితాల ఆధారంగా కాంగ్రెస్‌, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ (సోషలిస్టు పార్టీ, కిసాన్‌ మజ్దూర్‌ పార్టీ కలిసి), సీపీఐ, జనసంఘ్‌లు మాత్రమే జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్నాయి. మొత్తంగా ఏడు దశాబ్దాల్లో వీటి ప్రయాణాన్ని చూస్తే..

LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

  • 1957 రెండో సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం 15 పార్టీలు మిగలగా.. అందులో నాలుగు మాత్రమే జాతీయ పార్టీలు.
  • 1962 ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 27కు చేరగా.. కొత్తగా సోషలిస్టు (SOC), స్వతంత్ర (SWA) పార్టీలతో జాతీయ పార్టీల సంఖ్య 6కు పెరిగింది.
  • 1951 ఎన్నికల తర్వాత తదుపరి రెండుసార్లు సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1964లో ఆ పార్టీ రెండుగా చీలి సీపీఐ (మార్క్సిస్ట్‌) పార్టీ అవతరించింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కంటే సీపీఎం ఎక్కువ ఓట్లను గెలుచుకుంది.
  • స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిన జయప్రకాశ్‌ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్ట్‌ పార్టీ కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీలో విలీనమై ప్రజా సోషలిస్ట్‌ పార్టీగా (PSP) అవతరించింది.
  • ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన జేపీ.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పీఎస్పీ, ఇతర వర్గాలతో కలిసి భారతీయ లోక్‌దళ్‌ను ఏర్పాటుచేశారు. ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలన్నీ ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. భాజపా, సమాజ్‌వాదీ వంటి పార్టీల మూలాలు జనతా పార్టీవే.

పాతవి పోయి.. కొత్తవి వచ్చి..

  • 1992లో ఏడు జాతీయ పార్టీలు.. భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, జనతాదళ్‌, జనతా పార్టీ, లోక్‌దళ్‌ పార్టీలు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచాయి.
  • 1996లో సాధారణ ఎన్నికల్లో మొత్తంగా 209 పార్టీలు భాగస్వామ్యం కాగా అందులో ఎనిమిది జాతీయ పార్టీలున్నాయి. 1998 వచ్చేసరికి ఏడు జాతీయపార్టీలు సహా 176 మాత్రమే బరిలో నిలిచాయి.
  • 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పడిపోయింది. (భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ-ఎం, ఎన్సీపీ, బీఎస్పీ)
  • మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి 2014 ఎన్నికల వరకు అత్యధిక సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తర్వాతే భాజపా హవా మొదలయ్యింది.
  • 2016లో మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్‌ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ పార్టీ హోదా సాధించింది.
  • 2019 ఎన్నికల్లో మొత్తంగా 674 పార్టీలు ఉంటే అందులో ఏడు జాతీయ పార్టీలు. అయితే, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (CPI)లు ఇటీవల జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. అదేసమయంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) ఈ హోదా దక్కించుకుంది. 
  • ఇలా ఏడు దశాబ్దాల క్రితం 14తో మొదలైన జాతీయ పార్టీల ప్రస్థానం ప్రస్తుతం ఆరు (భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఎం, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ)కు పరిమితమైంది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, జాతీయ పార్టీ హోదా పొందాలంటే.. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో రెండు స్థానాలు చొప్పున గెలుచుకోవాలి లేదా నాలుగు లోక్‌సభ స్థానాలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరుశాతం ఓట్లయినా పొందాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగిఉండాలి. ఈ హోదా లభిస్తేనే దేశవ్యాప్తంగా పార్టీకి గుర్తు ఒకటే ఉంటుంది. దీంతోపాటు దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం స్థలం కూడా కేటాయిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని