LS polls: ఎన్నికల నియమావళి.. తొలి ‘కోడ్‌’ కూసింది అప్పుడే!

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (Model Code of Conduct)కి 1960లో అడుగులు పడ్డాయి.

Updated : 16 Mar 2024 10:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం.. నేడు పోలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. ఈసీ (Election Commission) ప్రకటన వెంటనే దేశవ్యాప్తంగా ‘ఎన్నికల నియమావళి’ (Model Code of Conduct) అమల్లోకి వస్తుంది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ఈ నియమావళికి 1960లోనే అడుగులు పడ్డాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి వీటికి బీజం పడింది. ప్రస్తుతం లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న వేళ 60ఏళ్ల ‘నియమావళి’ ప్రస్థానాన్ని పరిశీలిస్తే..

చట్టబద్ధత లేకున్నా..

ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి భాగస్వామ్య పక్షాల ఏకాభిప్రాయంతో రూపొందించిన నిబంధనల స్వరూపమే ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ (MCC). సక్రమంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం, పోలింగ్‌, కౌంటింగ్‌ జరగడమే దీని ముఖ్య ఉద్దేశం. అధికార పార్టీ.. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా దీని లక్ష్యం. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ (Election Schedule) ప్రకటించడం మొదలు.. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ‘ప్రవర్తనా నియమావళి’ నిబంధనలు అమలులో ఉంటాయి. కానీ, వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. అయినప్పటికీ దీనికి ఉన్న ప్రాముఖ్యాన్ని సుప్రీం కోర్టు (Supreme Court) పలు సందర్భాల్లో సమర్థించింది. కోడ్‌ ఉల్లంఘిస్తే.. దర్యాప్తు జరిపి, శిక్ష విధించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని స్పష్టం చేసింది.

‘మినిమమ్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’తో మొదలై..

దేశంలో 1968-69లో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో ‘మినిమమ్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ పేరుతో సెప్టెంబర్‌ 26, 1968న ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తొలిసారి జారీ చేసింది. ‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల పాత్ర, బాధ్యతలు: ఎన్నికల ప్రచార సమయంలో కనీస ప్రవర్తనా నియమావళి పాటించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి’ అనే పేరుతో దీన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత 1972, 1982, 1991, 2013లో నియమావళిని సవరించారు. అధికారంలో ఉన్న పార్టీల తీరుపై పర్యవేక్షణ అంశాన్ని 1979లో చేర్చారు. ‘‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రస్తుత రూపం సంతరించుకోవడానికి 60 ఏళ్లు పట్టింది. 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి దీన్ని అమలుచేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రవర్తించాల్సిన నియమాల రూపకల్పనతో దీనికి బీజం పడింది’’ అని భారత్‌లో ఎన్నికల ప్రయాణానికి సంబంధించి ఈసీ ప్రచురించిన ‘‘లీప్‌ ఆఫ్‌ ఫెయిత్‌ (Leap of Faith)’’ పుస్తకంలో పొందుపరిచారు.

కమిటీ సిఫార్సులు..

ప్రవర్తనా నియమావళికి చట్టబద్ధత కల్పించాలంటూ 2013లో ఓ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా ఎన్నికల సంఘం తన అధికారాలను సమర్థంగా వినియోగించుకునేందుకు ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఎన్నికలను ప్రకటించినప్పుడు కాకుండా నోటిఫికేషన్‌ విడుదలైనప్పటినుంచి కోడ్‌ అమలులోకి తేవడం, అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై మరింత స్పష్టత తెచ్చేందుకు సవరణ చేయడం, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఎన్నికల వివాదాలను 12 నెలల్లో పరిష్కరించడం, ఎన్నికైన ఆరు నెలల్లోగా స్వతంత్ర ఎంపీలు ఏదైనా రాజకీయ పార్టీలో చేరడం వంటివి సవరణలను సూచించింది.

ఉల్లంఘిస్తే చర్యలు..

నియమావళికి చట్టబద్ధత కల్పిచేందుకు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ.. తన పదవీకాలంలో తీవ్రంగా కృషి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసీ ప్రకారం, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారానికి తమ అధికారాలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతుంది. మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏ రూపంలోనూ ఆర్థిక నిధులు ప్రకటించలేరు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటరును ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు, పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించకూడదు. మంత్రులు కూడా ప్రచారం కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని