China-Pak: చైనా నుంచి పాక్‌కు సరకు రవాణా.. ముంబయి పోర్టులో నౌక నిలిపివేత..!

అణు కార్యక్రమంలో ఉపయోగించే సరకు ఉందనే అనుమానంతో చైనా నుంచి పాక్‌ వెళ్తోన్న ఓ నౌకను ముంబయి పోర్టులో నిలిపివేశారు.   

Published : 02 Mar 2024 18:05 IST

ప్రతీకాత్మక చిత్రం

ముంబయి: చైనా (China) నుంచి పాకిస్థాన్‌(Pakistan)కు వెళ్తోన్న ఓ నౌకను ముంబయి పోర్టులో భద్రతా ఏజెన్సీలు అడ్డుకున్నాయి. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా సమాచారంతో దానిని నిలిపివేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.

CMA CGM Attila పేరిట ఉన్న ఆ నౌకను జనవరి 23నే ముంబయి పోర్టులో నిలిపివేశారు. తర్వాత కస్టమ్స్ అధికారులు దానిని మొత్తం తనిఖీ చేయగా.. ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(CNC) మెషిన్‌ను గుర్తించారు. తర్వాత డీఆర్‌డీఓ(Defence Research and Development Organisation) తనిఖీలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పొరుగుదేశం తన అణు కార్యక్రమంలో దీనిని వినియోగించే అవకాశాలను తోసిపుచ్చలేమని వెల్లడించింది. CNCని కంప్యూటర్ ద్వారా నియంత్రించొచ్చు. అది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుంది. దానిని ద్వంద్వ ప్రయోజనాలకు వినియోగిస్తారు.

ప్రాంతీయ, అంతర్జాతీయంగా భద్రత, స్థిరత్వానికి దోహదపడేందుకు 1996లో వాస్సెనార్ అరేంజ్‌మెంట్ జరిగింది. ఆయుధాలు, సాంకేతిక పరికరాల ఎగుమతుల్లో పారదర్శకత కోసం దానిని తీసుకువచ్చారు. ఈ అరేంజ్‌మెంట్ కింద మనతో సహా 42 దేశాలకు భాగస్వామ్యం ఉంది. దీనిలోభాగంగా సీఎన్‌సీ మెషిన్‌ దుర్వినియోగాన్ని నివారించేందుకు 1996 నుంచి నియంత్రణ ఉంది. గతంలో ఉత్తరకొరియా కూడా తన అణు కార్యక్రమంలో దీనిని ఉపయోగించింది.

ఈక్రమంలో రక్షణశాఖ అధికారులు నౌకలోని సరకును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలాఉంటే.. చైనా నుంచి పాక్‌కు రవాణా అవుతున్న ఇలాంటి మిలిటరీ గ్రేడ్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2022లోను ఈతరహా సీజ్‌ చోటుచేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని