ఈయన పాకిస్థాన్‌ చార్లి చాప్లిన్‌!

చార్లి చాప్లిన్‌.. ప్రపంచమంతా ఇష్టపడే హాస్యనటుడు. టోపీ, చిన్న మీసం, చేతిలో కర్ర, అమాయకపు ముఖం, గమ్మత్తయిన నడక, నటనతో అందరి ముఖాల్లో నవ్వులు పూయించిన గొప్ప వ్యక్తి. ప్రస్తుతం చాప్లిన్‌ లేకున్నా ఇప్పటికీ ఆయన సినిమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే, ఎంతో మంది

Updated : 16 Feb 2021 14:03 IST


(ఫొటో: ఉస్మాన్‌ ఖాన్‌ ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: చార్లి చాప్లిన్‌.. ప్రపంచమంతా ఇష్టపడే హాస్యనటుడు. టోపీ, చిన్న మీసం, చేతిలో కర్ర, అమాయకపు ముఖం, గమ్మత్తయిన నడక, నటనతో అందరి ముఖాల్లో నవ్వులు పూయించిన గొప్ప వ్యక్తి. ప్రస్తుతం చాప్లిన్‌ లేకున్నా ఇప్పటికీ ఆయన సినిమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే, ఎంతో మంది చాప్లిన్‌లా వేషం ధరించి ఆయన్ను అనుకరిస్తూ నవ్వించే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్‌లోనూ ఓ వ్యక్తి చార్లి చాప్లిన్‌లా మారిపోయాడు. కేవలం వేషమే కాదు.. సినిమాల్లో చాప్లిన్‌ తన చేష్టలతో నవ్వు తెప్పించినట్లుగా.. ఈ పాకిస్థాన్‌ చార్లి చాప్లిన్‌ నిజ జీవితంలోనూ ప్రజల మధ్యలో తిరుగుతూ.. తన చేష్టలతో నవ్వులు తెప్పిస్తున్నాడు. తన వీడియోలను టిక్‌టాక్‌లో పోస్టు చేస్తుండటంతో ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. 

పాక్‌లోని పెషావర్‌ నగరంలో నివసిస్తున్న 32 ఏళ్ల ఉస్మాన్‌ ఖాన్‌ గత కొన్ని నెలలుగా నగర వీధుల్లో చార్లి చాప్లిన్‌ వేషాధారణతో తిరుగుతున్నాడు. దుకాణదారుల్ని.. రోడ్డుమీద వెళ్తున్న వారిని ఆటపట్టిస్తూ.. తనపై తానే సెటైర్లు వేసుకొని ఇతరుల్ని నవ్విస్తున్నాడు. మొదట్లో ప్రజలు ఆయన్ను కాస్త వింతగా చూసినా.. ఆ తర్వాత బాగా ఆదరిస్తున్నారు. అతడితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. మరోవైపు వీటికి సంబంధించిన వీడియోలను ఉస్మాన్‌ తన టిక్‌టాక్‌ ఖాతాలో పోస్టు చేస్తుండటంతో మంచి గుర్తింపు లభించింది. రెండు నెలల వ్యవధిలో 8.50లక్షల ఫాలోవర్స్‌ పెరిగారు. దీంతో ఉస్మాన్‌ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు.

మంచి ఉద్యోగం చేస్తూ జీవితం గడిపిన ఉస్మాన్‌ ఇలా మారడానికి ఓ కారణముంది. ‘లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఎన్నో సమస్యలు, ఒతిళ్లతో సతమతమయ్యారు.. వారి ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. అందుకే వారిని నవ్వించడం కోసం నేను ఈ చార్లి చాప్లిన్‌లా మారా’నని చెప్పుకొచ్చాడు. కొన్ని నెలల కిందట అతడు అనారోగ్యంతో మంచం పట్టాడట. చికిత్స తీసుకొని కోలుకుంటున్న సమయంలో చార్లి చాప్లిన్‌ సినిమాలు చూశానని, ఆ తర్వాతే ఆయనలాగా మారాలన్న ఆలోచన వచ్చిందని ఉస్మాన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని