Naveen Patnaik: నవీన్‌ పట్నాయక్‌ సహాయకుడు పాండ్యన్‌ ఎక్కడ..?

ఒడిస్సా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సహాయకుడు వీకే పాండ్యన్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక్కసారిగా అదృశ్యమయ్యారు.

Published : 06 Jun 2024 16:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒడిశా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik)  విశ్వాసపాత్రుడు వి.కె.పాండ్యన్‌ ఒక్కసారిగా మీడియా నుంచి అదృశ్యమైపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పట్నాయక్‌ ఎక్కడికి వెళ్లినా ఆయన్ను వెన్నంటే ఉంటారనే పేరుంది. కానీ, బుధవారం పట్నాయక్‌ ఒంటరిగానే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత పార్టీ మీటింగ్‌లను నిర్వహించారు. ఈ సమయంలో సహాయకుడు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఆంగ్లపత్రిక వద్ద స్పందిస్తూ..‘‘పాండ్యన్‌ బాబు మీటింగ్‌లో ఎక్కడా కనిపించలేదు. నవీన్‌ బాబు మాత్రం మాట్లాడారు. అధికారం లేకపోయినా.. ప్రజల కోసం పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు’’ అని పేర్కొన్నారు.

ముఖ్యంగా నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం సరిగా లేదని భాజపా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓ సభలో నవీన్‌ మాట్లాడుతుండగా.. ఆయన చేతులు వణుకుతున్న దృశ్యాలు అందరి కంటపడ్డాయి. తక్షణమే పాండ్యన్‌ ఆయన చేతులను పక్కకు తీసినట్లున్న వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 

బిజద ఎన్నికల ఓటమికి ప్రధాన కారణాల్లో పాండ్యన్‌ నిర్ణయాలు కూడా ఒకటిని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన పార్టీకి స్టార్‌ ప్రచారకుడిగా కూడా వ్యవహరించారు. అన్ని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఈసారి రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కాకపోతే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వీకే ఎన్నికల ప్రచారంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్‌ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు మాట్లాడుతూ..‘‘భాజపా వేవ్ ఉందని, ఒడిశాలో మార్పు ఉంటుందని మీరు చెప్తున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే, నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా’’ అని ప్రతిజ్ఞ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని