Uttar Pradesh: షాకింగ్‌.. రోడ్డుకు అడ్డంగా కారు ఆపిన నేత.. అంబులెన్స్‌లో రోగి మృతి

ఓ భాజపా నేత వ్యవహరించిన తీరుతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరి ఆగ్రహానికి దారితీస్తోంది. 

Published : 05 Apr 2023 00:33 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ భాజపా నేత నిర్లక్ష్యం.. అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి ప్రాణం తీసింది. అయినా ఎటువంటి పశ్చాత్తాపం లేకపోవడంతో విస్తుపోవడం బాధితుల వంతైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్(Uttar Pradesh's Sitapur district)కు చెందిన సురేశ్‌ చంద్ర అనే వ్యక్తికి శనివారం గుండెపోటు వచ్చింది. దాంతో అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో లఖ్‌నవూ ఆసుపత్రి( Lucknow hospital)కి తీసుకెళ్లమని  కుటుంబసభ్యులకు  వైద్యులు సూచించారు. దాంతో వెంటనే వారు అంబులెన్స్‌లో పెద్దాసుపత్రికి బయలుదేరారు. అయితే వారు వెళ్తున్న దారిలో భాజపా నేత ఉమేశ్‌ మిశ్రా(Umesh Mishra) తన కారును రోడ్డుపై ఆపి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో అంబులెన్స్‌ 30 నిమిషాల పాటు అక్కడినుంచి కదలడానికి వీలు లేకుండా పోయింది. ఈ లోపులో బాధితుడు గుండెపోటుతో విలవిల్లాడిపోయాడు. చివరకు తక్షణ వైద్యసహాయంఅందక ఆ వాహనంలోనే ప్రాణాలు విడిచాడు. ఇది కుటుంబ సభ్యుల ఆగ్రహానికి దారితీసింది. 

కొద్దిసేపటి తర్వాత కారువద్దకు వచ్చిన ఉమేశ్‌(Umesh Mishra)పై వారు మండిపడ్డారు. తాను చేసిన తప్పును గుర్తించకుండా.. ఉమేశ్‌ తిరిగి వీరినే దూషించడం మొదలుపెట్టాడు. తానొక రాజకీయ నేత సోదరుడునని, అందరిపై పోలీసు కేసు పెడతానని బెదిరించాడు. జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ తన సూచనల ప్రకారమే పనిచేస్తారని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ కొందరు పోలీసులు ఉన్నప్పటికీ, చూస్తూ ఉండిపోయారు. స్థానికులు ఈ ఘటనను కెమెరాల్లో రికార్డు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై విరుచుకుపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని