EC: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకు కాంగ్రెస్‌..

Election Commissioners: ఎన్నికల కమిషనర్ల నియామక అంశం సుప్రీంకోర్టుకు చేరింది.  ఈ నియామకాలను కేంద్రం చేపట్టకుండా నిలువరించాలంటూ కాంగ్రెస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated : 11 Mar 2024 11:54 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకం కొత్త వివాదానికి తెరలేపింది. కేంద్ర ఎన్నికల సంఘం (EC)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేయనుంది. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ (Congress) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. 2023 నాటి తీర్పును అనుసరించి ఈ నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

15కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం!

దీంతో ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌ సుప్రీంకోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసీల నియామకాలపై 2023లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి తాజా నియమకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ అభ్యర్థించారు.

ఏంటా తీర్పు..?

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, గతేడాది డిసెంబరులో కేంద్రం దీనిపై కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది.

ఈ కొత్త చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంపిక కమిటీలో కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటే.. ఈసీ స్వతంత్రతకు ముప్పు వాటిల్లితుందని ఆరోపించాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై ఏప్రిల్‌లో విచారణ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని