15కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Published : 11 Mar 2024 05:21 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ తొలుత ఒక్కో పోస్టుకు ఐదుగురి పేర్లతో వేర్వేరు జాబితాలను సమర్పిస్తుంది. వారిలో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్‌గా ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది. గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. శుక్రవారం అనూహ్యంగా మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేయగా శనివారం రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు.

వ్యక్తిగత కారణాలవల్లేనా?

వ్యక్తిగత కారణాలతోనే ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేసి ఉంటారని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు, అయనకు మధ్య విభేదాలేవీ లేవని స్పష్టంచేశాయి. అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు, మినిట్స్‌, నిర్ణయాల్లో అరుణ్‌ గోయెల్‌ ఎటువంటి భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు రికార్డు కాలేదని పేర్కొన్నాయి. శుక్రవారం ఉదయం రాజీనామా చేసిన గోయెల్‌.. కేంద్ర హోంశాఖ, రైల్వేశాఖ అధికారులతో జరిగిన అత్యంత కీలక సమావేశానికి హాజరుకాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని