Arvind Kejriwal: ప్లీజ్‌ మోదీజీ.. బడ్జెట్ ఆపొద్దు: ప్రధానికి కేజ్రీవాల్ లేఖ

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal).. ప్రధాని మోదీకి లేఖ రాశారు. 

Updated : 21 Mar 2023 12:27 IST

దిల్లీ: దిల్లీ(Delhi)లోని ఆప్‌ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈసారి దిల్లీ బడ్జెట్ రెండు వర్గాల మధ్య తాజా ప్రతిష్టంభనకు కారణమైంది. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి లేఖ రాశారు. బడ్జెట్‌ను ఆపొద్దని అందులో కోరారు. 

‘75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలా ఒక రాష్ట్రస్థాయి బడ్జెట్‌ను ఆపడం ఇదే మొదటిసారి. మీరెందుకు దిల్లీ ప్రజల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. బడ్జెట్‌ను అడ్డుకోవద్దని దిల్లీ ప్రజలు రెండుచేతులు జోడించి కోరుతున్నారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. మంగళవారం దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదని నిన్న  కేజ్రీవాల్ వెల్లడించారు. అందుకు కేంద్రప్రభుత్వ వైఖరే కారణమని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజా లేఖను రాశారు. 

ప్రస్తుతం దిల్లీ బడ్జెట్‌ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వద్ద నిలిచిపోయింది. ఆప్‌(AAP) ప్రభుత్వం ప్రకటనలపై చేసిన ఖర్చు, దిల్లీలో ఆయుష్మాన్‌ భారత్ అమలు చేయకపోవడం, దేశ రాజధాని నగరంలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం.. వంటి పలు అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ప్రభుత్వాన్ని కోరామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వీటికి సమాధానం ఇస్తూ.. బడ్జెట్‌ ప్రతులను మళ్లీ పంపాలని కోరినట్లు చెప్పింది. నాలుగురోజులుగా సమాధానాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం వద్ద బడ్జెట్‌ నిలిచిపోయిందని, మంగళవారం దానిని ప్రవేశపెట్టడం లేదని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఉండవని కేజ్రీవాల్‌ ప్రకటించారు. దాంతో కేంద్రం నుంచి ఈ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. కేంద్రం లెవనెత్తిన ప్రశ్నలు అసంబద్ధమైనవని, తమను ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్‌ గహ్లోత్ ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని