ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. తొలిసారి కశ్మీర్‌లో ల్యాండ్‌ అయిన మోదీ

నేడు ప్రధాని మోదీ(Modi) కశ్మీర్‌కు వెళ్లారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Published : 07 Mar 2024 13:10 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ(Modi) కశ్మీర్‌కు వెళ్లారు. భారత సైన్యానికి చెందిన 15 కార్ప్స్‌ కేంద్ర కార్యాలయంలో ల్యాండ్‌ అయ్యారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో "వికసిత్‌ భారత్... వికసిత్‌ జమ్మూకశ్మీర్‌’’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈక్రమంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకొని మోదీ, మోదీ అని నినాదాలు చేశారు.

మోదీ పర్యటనను పురస్కరించుకుని కశ్మీర్‌ లోయలో ఇప్పటికే హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ప్రధాని జమ్మూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రూ.32వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అప్పటినుంచి ప్రధాని మోదీ మూడుసార్లు జమ్మూలో పర్యటించగా.. కశ్మీర్‌ లోయకు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న   వేళ ప్రధాని పర్యటన కీలకంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని