PM Modi: ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన

భారత్‌లో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్న కుటుంబాల వారు ప్రారంభించాలని ప్రధాని మోదీ కోరారు. 

Published : 08 Dec 2023 15:42 IST

దేహ్రాదూన్‌: విదేశాల్లో వివాహ వేడుకలు (Destination Wedding) చేసుకుంటున్న భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ (PM Modi) మరోసారి కీలక సూచన చేశారు. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని యువ జంటలు విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేశారా? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్న కుటుంబాల వారు ప్రారంభించాలని కోరారు.

‘‘మేకిన్‌ ఇండియా (Make In India) తరహాలో దేశంలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ (Wed in India) ప్రారంభం కావాలి. భారత్‌లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని (పెళ్లి) విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి. ఉత్తరాఖండ్‌ను తమ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు వేదికగా ఎంచుకోవాలి. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక వివాహం ఉత్తరాఖండ్‌లో చేసుకుంటే.. దేవభూమి ప్రముఖ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాంతంగా మారుతుంది. అలా, ఏడాదిలో ఐదు వేల డెస్టినేషన్ వెడ్డింగ్‌లు ఉత్తరాఖండ్‌లో జరిగితే.. రాష్ట్రంలో మౌలికవసతుల సదుపాయాలు వాటంతటవే మెరుగవుతాయి. ఇదే తరహాలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలం చేకూరుతుంది. స్థానిక ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

మూడో సారి అధికారంలోకి..

ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి మూడో సారి ప్రధాని పదవి చేపడతానని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను మూడో సారి ప్రధాని పదవి చేపట్టాక.. రాబోయే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశంలో విధానపరమైన పాలనను మీరు చూస్తున్నారు. భారత్‌ ఆకాంక్షలు నెరవేరాలంటే.. సుస్థిర ప్రభుత్వం అవసరం. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని