Chennai Rains: మోదీ ఆందోళన చెందారు.. పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు: రాజ్‌నాథ్‌

తుపాను బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

Updated : 07 Dec 2023 17:05 IST

చెన్నై: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తమిళనాడులో మిగ్‌జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలతో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన చెందారని వెల్లడించారు.  తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలని తనను ఆదేశించారని.. సీఎం స్టాలిన్‌తోనూ ఆయన ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు.  ఎన్డీఆర్‌ఎఫ్‌తో సహా అన్ని కేంద్ర బృందాలు సహాయక చర్యలు బాగా నిర్వహిస్తున్నాయని రాజ్‌నాథ్‌ తెలిపారు.  చెన్నైలో వరద బాధితప్రాంతాల్లో సహాయ కార్యకలాపాల కోసం కేంద్రం రూ.500 కోట్లను ఆమోదించిందని.. రెండో విడత కింద  రూ.450 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను ప్రధాని ఆదేశించారని చెప్పారు. 

అంతకముందు, తుపానుతో నష్టపోయిన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే అనంతరం సచివాలయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు, వరదలతో దెబ్బతిన్న చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి,  ఈ విపత్తు వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి సాయం తదితర అంశాలపై చర్చించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌వెంట కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ కూడా ఉన్నారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్‌, తిరువళ్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని.. తక్షణ సాయంగా రూ.5060 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని