Millets Song: తృణధాన్యాలపై పాట.. గ్రామీ విజేతతో కలిసి మోదీ రచన, గాత్రం

Millets Song: తృణధాన్యాలపై ప్రచారం కోసం ప్రధాని మోదీ స్వయంగా ఓ పాటను రచించడమే గాక.. గాత్రాన్ని అందించారు. ప్రముఖ గ్రామీ అవార్డు విజేత ఫాల్గుణి షాతో కలిసి ఈ పాటను ఆయన రాశారు.

Published : 16 Jun 2023 13:07 IST

న్యూయార్క్‌: తృణధాన్యాల (Millets) వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా (ఫాలు) ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటకు భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన సహకారాన్ని అందించారు. గాయని ఫాలుతో కలిసి ఈ గీతాన్ని రచించడంతో పాటు తన గాత్రాన్ని కూడా అందించారు.

‘Abundance in Millets’ పేరుతో ఫాలు (Falguni Shah), ఆమె భర్త గౌరవ్‌ షా ఈ పాట (Song)ను శుక్రవారం విడుదల చేశారు. ఇంగ్లిష్‌, హిందీలో ఉన్న ఈ పాటను ఫాలు దంపతులతో కలిసి ప్రధాని మోదీ రచించారు. గీతం మధ్యలో మోదీ (Modi) స్వయంగా పలికిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించొచ్చన్నది ఈ పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు.

మోదీ సూచనతో..

గాయని ఫాలు ముంబయిలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 2022లో ఆమె ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు (Grammy Award) గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గతేడాది దిల్లీ వచ్చిన ఫాలు దంపతులు ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో తృణధాన్యాలపై ప్రత్యేక గీతాన్ని రచించాలనే ఆలోచన వచ్చిందని ఫాలు తెలిపారు. ‘‘మానవాళి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో సంగీతానికి బలమైన శక్తి ఉంది. అందుకే ఆకలి నిర్మూలన కోసం ఓ పాట రచించాలని ప్రధాని మోదీ ఆనాడు సలహా ఇచ్చారు. తృణధాన్యాల్లో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే భారత్‌ వాటిని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీఅన్నంపై పాట రాయాలని ప్రధాని సూచించారు’’ అని గాయని ఫాలు నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇందులో ప్రధాని (PM modi) కూడా భాగం కావాలని తాము కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తమతో కలిసి పాటను రచించాలని మోదీని అభ్యర్థించినట్లు చెప్పారు. ఇందుకు ఆయన కూడా అంగీకరించారని తెలిపారు. ‘‘ప్రధానితో కలిసి పాట రాయడానికి మొదట మేం కాస్త కంగారుపడ్డాం. ఆయన కోసం రాయడం వేరు.. ఆయనతో కలిసి రాయడం వేరు. అందుకే కొంత భయపడ్డాం. కానీ, ఆ తర్వాత మా రచన హాయిగా కొనసాగింది. పాట మధ్యలో ఆయన మాటలను మీరు వింటారు. అది స్వయంగా ఆయన రాసినదే’’ అని ఫాలు చెప్పారు. ప్రధానితో కలిసి పాటను రచించడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో ఈ పాటను రాశామని, త్వరలోనే దీన్ని ఇతర ప్రాంతీయ భాషాల్లోకి అనువాదం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

భారత ప్రతిపాదన మేరకు ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం (International Year of Millets)గా ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 130కి పైగా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది వీటిని సంప్రదాయ ఆహారంగా పరిగణిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని