PM Modi: వైదిక వారసత్వ పరిరక్షణలో ఆర్యసమాజ్‌ పాత్ర అమోఘం

Eenadu icon
By National News Desk Updated : 01 Nov 2025 05:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

భారతీయ విలువల గురించి నిర్భీతిగా మాట్లాడిన సంస్థ ఇది 
ప్రధాని మోదీ వ్యాఖ్యలు 

దిల్లీలో శుక్రవారం అంతర్జాతీయ ఆర్యుల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ 

దిల్లీ: ప్రముఖ సంఘ సంస్కర్త దయానంద్‌ సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్‌.. భారత వైదిక వారసత్వ పరిరక్షణలో అందించిన సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ పురాతన రాత ప్రతులు, సహజసిద్ధ వ్యవసాయాన్ని పరిరక్షించడానికి ఈ సంస్థ కృషి చేయాలని కోరారు. ఆర్య సమాజ్‌ 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహించిన ‘అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్‌’ను ఉద్దేశించి శుక్రవారం ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సమరంలో ఈ సంస్థ పాత్రను ప్రశంసించారు. అయినా రాజకీయ కారణాల వల్ల ఈ అంశంలో సరైన గుర్తింపునకు నోచుకోలేదన్నారు. ‘‘ఆర్య సమాజ్‌ ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భం.. సమాజంలో ఒక వర్గానికే పరిమితం కాదు. ఇది వైదిక వారసత్వం, భారత దేశ విశిష్టతతో ముడిపడింది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రగతికి అడ్డంకిగా మారిన కట్టుబాట్లకు స్వస్తి పలికి, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగేలా దయానంద్‌ సరస్వతి అందరిలోనూ స్ఫూర్తిని నింపారన్నారు. 

జాతి నిర్మాణంలో ఆర్య సమాజ్‌ ఎన్నో సేవలు అందించిందని మోదీ తెలిపారు. స్వదేశీ ఉద్యమానికి ఊపిరిలూదిందన్నారు. ‘‘పురాతన రాతప్రతులపై యువత అధ్యయనం చేసేలా మీ గురుకులాలు, ఇతర సంస్థల ద్వారా చర్యలు చేపట్టాలి. ప్రకృతి సేద్యం, తృణ ధాన్యాల సాగుపై అవగాహన కల్పించాలి. జల్‌జీవన్‌ మిషన్, అమృత్‌ సరోవర్‌ వంటి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలి’’ అని ఆర్య సమాజ్‌ను కోరారు. లాలా లజపతి రాయ్, రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ వంటి ఎందరో ఆర్య సమాజ్‌ నుంచి స్ఫూర్తి పొందారని తెలిపారు. భారతీయ విలువల గురించి ఈ సంస్థ నిర్భయంగా గొంతెత్తిందన్నారు. దేశ వ్యతిరేక సిద్ధాంతాలతోపాటు, సంస్కృతిని కలుషితం చేసే ప్రయత్నాలపై పోరాడిందని పేర్కొన్నారు. కులవివక్ష, అంటరానితనాన్ని దయానంద్‌ సరస్వతి వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, 39 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

క్షమాపణలు చెప్పిన మోదీ

అంతకుముందు దయానంద సరస్వతి 200 జయంతి, ఆర్య సమాజ్‌ 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను గుర్తిస్తూ నాణేలను మోదీ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చానంటూ సభికులకు క్షమాపణ చెప్పారు. ‘‘ఈరోజు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి. అందువల్ల ఐక్యతా విగ్రహం  వద్ద కార్యక్రమం ఉంది. ఫలితంగా ఆలస్యమైంది’’ అని పేర్కొన్నారు.

Tags :
Published : 01 Nov 2025 05:00 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు