PM Modi: భూటాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోజు ఆలస్యంగా భూటాన్‌ పర్యటనను ప్రారంభించారు. ఈ ఉదయం ఆయన థింపునకు బయల్దేరి వెళ్లారు.

Updated : 22 Mar 2024 10:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్‌ పర్యటనకు ఈ ఉదయం బయల్దేరి వెళ్లారు. వాస్తవానికి నిన్ననే ఆయన పర్యటన ప్రారంభం కావాల్సింది. అనివార్యకారణాలతో ఒక రోజు జాప్యం చోటు చేసుకొంది. తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్‌ గ్యాల్పో’ను ఆయనకు అందజేయనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానికి అక్కడకు వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు దానిని స్వయంగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు, కొవిడ్‌ సమయంలో తొలి విడతలోనే 5,00,000 టీకాలను అందజేయడం వంటి చర్యలు తీసుకొన్నందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.

భూటాన్‌కు చేరుకొన్నాక మోదీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంధన వినియోగం, ఆహార సురక్షిత ప్రమాణాలపై ఒప్పందాలు జరగనున్నాయి. థింపులో భారత నిధులతో నిర్మించిన ఆస్పత్రిని మోదీ ప్రారంభించనున్నారు. ఆ దేశ 13వ పంచవర్ష ప్రణాళిక, వివిధ రంగాల్లో  భారత్‌ అందించాల్సిన సాయంపై చర్చలు జరగనున్నాయి. అస్సాం సమీపంలోని భూటాన్‌లో ‘గెల్పూ మైండ్‌ఫుల్‌నెస్‌ సిటీ’ నిర్మాణం అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రానుంది. భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ తోబ్గే ఇటీవల భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని