PM Modi: ‘గహ్లోత్‌ జీ.. మీ చేతిలో రెండు లడ్డూలున్నాయ్‌..’

రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ఠంభన నెలకొన్న సమయంలోనూ వందేభారత్‌ రైలు (Vande Bharat Express) ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారంటూ రాజస్థాన్‌ సీఎంపై ప్రధాని మోదీ (Narendra Modi) ప్రశంసలు గుప్పించారు.

Published : 12 Apr 2023 18:15 IST

జైపుర్‌: ‘వందేభారత్‌’ (Vande Bharat Express) రైలు ప్రారంభోత్సవానికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. గహ్లోత్‌ తనకు మంచి మిత్రుడన్న మోదీ.. రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్ఠంభన నెలకొన్న సమయంలోనూ ఈ కార్యక్రమానికి హాజరు అయినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. రాజస్థాన్‌లో తొలి వందేభారత్‌ రైలును వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.

‘గహ్లోత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ సమయం తీసుకొని రైల్వే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నా’ అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతకుముందు గహ్లోత్‌ ప్రసంగాన్ని ప్రస్తావించిన మోదీ.. తనపై గహ్లోత్‌ ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇది  స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్‌లు ఇద్దరూ రాజస్థాన్‌కు చెందినవారేనని గుర్తుచేసిన మోదీ.. ‘గహ్లోత్‌ జీ.. మీ చేతులో రెండు లడ్డూలున్నాయ్‌’ అంటూ చమత్కరించారు.

రాష్ట్రానికి గొప్పవరం : గహ్లోత్‌

రాజస్థాన్‌కు వందేభారత్‌ రైలు రావడం గొప్పవరం అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు పెరిగితే ఆర్థికరంగంలో దేశంలోనే రాజస్థాన్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి రాజస్థాన్‌ వ్యక్తి రైల్వేమంత్రిగా కొనసాగుతున్నారన్న ఆయన.. రాష్ట్రంలో మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా చేపట్టాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు.

15వ వందేభారత్‌..

దేశంలోని పలు ముఖ్య నగరాల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వందేభారత్‌  (Vande Bharat)కు విశేష స్పందన లభిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు అజ్మీర్‌-దిల్లీ కంటోన్మెంట్‌ మధ్య నడుస్తుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం సమయం కేవలం 5గంటల 15నిమిషాలు. దేశంలో ఇప్పటివరకు 14 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలు ఎక్కగా.. తాజాగా ప్రారంభమైన ఈ రైలుతో ఆ సంఖ్య 15కి చేరినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని