PM Modi: ఉగ్రవాదులు పారిపోయినా.. వెంటాడి మరీ మట్టుబెడతాం: మోదీ

ఉగ్రవాదులు వారి సొంత దేశాలకు పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరి హతమారుస్తామని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 11 Apr 2024 18:28 IST

దెహ్రాడూన్‌: భారత్‌కు హాని తలపెట్టేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను వదలబోమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఉరి, బాలాకోట్‌ దాడులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని రిషికేశ్‌లో భాజపా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పదేళ్లలో కేంద్రంలోని తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరోసారి గుర్తుచేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ హయాంలోని తప్పులను ఎత్తిచూపారు. ‘‘నేడు మన దేశంలో బలమైన ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదులు తిరిగి తమ సొంత దేశాలకు పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ వారిని హతమారుస్తాం. ఏడు దశాబ్దాల అనంతరం ఎన్డీయే నేతృత్వంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దయింది. త్రిపుల్‌ తలాక్‌కు చట్టం తీసుకువచ్చింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. పేద, జనరల్‌ కేటగిరీలకు 10 శాతం రిజర్వేషన్‌ దక్కింది’’ అని గుర్తు చేశారు.  

కేంద్రంలో బలహీన ప్రభుత్వముంటే.. 

కాంగ్రెస్‌ హయాంలోని తప్పులను ప్రస్తావిస్తూ.. ఆ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దేశం కోసం పోరాడే సైనికులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. వారికి సరైన బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లను అందించలేకపోయింది. కానీ, మా ప్రభుత్వం వారికి అవన్నీ అందించి ఎంతోమంది సైనికులను కాపాడుకోగలుగుతోంది. యుద్ధ విమానాలు, ఆధునిక రైఫిల్స్‌ వంటి ఆయుధాలను స్వయంగా తయారుచేసుకునేలా భారత్‌ అభివృద్ధి చెందింది. ఒకవేళ కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే అది మన శత్రువులకు బలం చేకూరుస్తుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని