PM Modi: ‘తేజస్‌’ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ..

ప్రధాని మోదీ (PM Modi) శనివారం తేజస్‌ యుద్ధ విమానం (Tejas aircraft)లో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Updated : 25 Nov 2023 15:09 IST

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) కర్ణాటక (Karnataka)లో పర్యటిస్తున్నారు. శనివారం ఆయన బెంగళూరు (Bengaluru)లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL)ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ (Tejas aircraft)లో విహరించారు. ఆ ఫొటోలను ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. (PM Modi takes sortie on Tejas aircraft)

‘‘తేజస్‌ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేశాను. ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంతో మన స్వదేశీ సామర్థ్యంపై నా విశ్వాసం మరింత పెరిగింది. మన దేశ శక్తి సామర్థ్యాల పట్ల నాకు గర్వంగా ఉంది. ఇది మన శాస్త్రవేత్తల కృషి, అంకితభావానికి నిదర్శనం. స్వావలంబనలో మనం ప్రపంచంలో ఎవరి కంటే తక్కువ కాబోమని నేను గర్వంగా చెప్పగలను. భారత వాయుసేన, డీఆర్‌డీవో, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హల్‌)కు హృదయపూర్వక అభినందనలు’’ అని మోదీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా హల్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తయారీ యూనిట్‌ను ప్రధాని పరిశీలించారు.

‘మరాఠాల వ్యూహాలతోనే.. ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌కు భంగపాటు!’

ఎయిర్‌ఫోర్స్‌, భారత నేవీ వినియోగిస్తున్న తేజస్‌ ట్విన్‌ సీట్‌ ట్రైనర్‌ వేరియంట్‌లో ప్రధాని నేడు విహరించారు. ఈ తేలికపాటి యుద్ధ విమానాన్ని తొలుత వాయుసేన కోసం హల్‌ రూపొందించింది. ఆ తర్వాత గ్రౌండ్‌ మారిటైమ్‌ ఆపరేషన్స్‌ కోసం నావెల్‌ వేరియంట్‌ను కూడా పరీక్షిస్తున్నారు. ఇక, ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ వాషింగ్టన్‌ పర్యటన సందర్భంగా.. హల్‌, అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జీఈ) మధ్య కీలక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన F414 ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌తో కలిసి భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఇంజిన్లను తేజస్‌ మార్క్‌-2 యుద్ధవిమానాల్లో అమర్చనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని