Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..

రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు.

Updated : 05 Mar 2024 19:04 IST

Underwater Metro Rail in Kolkata! ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు (Metro Rail) అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇంజినీరింగ్‌ అద్భుతం కోల్‌కతాలో బుధవారం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే తొలిసారి పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతుల్ని పంచేలా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మార్చి 6న ప్రారంభించనున్న ఈ ప్రతిష్ఠాత్మక మెట్రో విశేషాలివే..

  • హుగ్లీ నది కిందిభాగంలో నిర్మించిన మెట్రో సొరంగ మార్గమిది. హావ్‌డా మైదాన్‌ - ఎస్‌ప్లనేడ్‌లను కలుపుతూ 4.8 కి.మీ.ల మేర నిర్మించిన ఈ గ్రీన్‌లైన్‌ తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్‌లో భాగం. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హావ్‌డా మైదాన్‌, హావ్‌డా స్టేషన్‌ కాంప్లెక్స్‌, బీబీడీ బాగ్‌ (మహాకరణ్‌).
  • కోల్‌కతా మెట్రోలో హావ్‌డా మైదాన్‌ - ఎస్‌ప్లనేడ్‌ సెక్షన్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది దేశంలోనే నది కింద నిర్మితమైన అతి పెద్ద టన్నెల్‌. హావ్‌డా మెట్రో స్టేషన్ భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్. 
  • నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన రైళ్లు సర్వీసులు నడుస్తాయి. ఇదో అద్భుతమని.. ఈ మార్గంలో రోజూ దాదాపు 7లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు కోల్‌కతా మెట్రో రైలు జీఎం తెలిపారు. ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తామని కోల్‌కతా మెట్రో రైల్‌ సీపీఆర్వో తెలిపారు.
  • దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
  • కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా  భూ ఉపరితలంపైనే.
  • కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద రూ.120 కోట్లతో ఈ సొరంగ రైలుమార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. 520 మీటర్ల పొడవు ఉన్న దీన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు వింత అనుభూతిని అందిస్తుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. 
  • లండన్‌-ప్యారిస్‌ కారిడార్‌లోని యూరోస్టార్‌ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది. ఈ వినూత్న ప్రాజెక్ట్ తో రైలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రావడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. 
  • నది గర్భంలో నిర్మించిన ఈ టన్నెల్‌ మార్గం ద్వారా సర్వీసులందించే కోల్‌కతా మెట్రో రైలు జంట నగరాలైన హావ్‌డా, కోల్‌కతాలను కలుపుతుంది. మొత్తం ఆరు స్టేషన్ల ద్వారా సేవలందిస్తుంది. వీటిలో మూడు స్టేషన్లు నదీ కింది భాగంలో ఉండటం విశేషం. 
  • జూన్ లేదా జులైలో సాల్ట్ లేక్ సెక్టార్ Vs, హావ్‌డా మైదాన్ మధ్య మొత్తం తూర్పు-పశ్చిమ మార్గంలో కార్యకలాపాలను ప్రారంభించాలని కోల్‌కతా మెట్రో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 4.8 కి.మీ.ల మేర ప్రారంభానికి సిద్ధమైన హావ్‌డా మైదాన్‌ - ఎస్‌ప్లనేడ్‌ మార్గం.. హావ్‌డా మైదాన్‌ - ఐటీ హబ్‌ సాల్ట్‌లేక్‌ సెక్టార్‌ Vs అనుసంధానంలో రెండో భాగం.
  • ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది.  అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని