Modi ka Parivar: ‘మోదీ కా పరివార్‌’.. ఎంతో శక్తినిచ్చింది: ప్రధాని మోదీ

మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ‘మోదీ కా పరివార్‌’ సమర్థంగా చాటిచెప్పిందని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు.

Published : 11 Jun 2024 21:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల వేళ భాజపా నేతల సామాజిక మాధ్యమాల ఖాతాల్లో ‘‘మోదీ కా పరివార్‌ (మోదీ కుటుంబం)’’ (Modi Ka Parivar) అనే నినాదం ప్రత్యేకంగా కనిపించింది. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారు’’ అని ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమలం పార్టీ నేతలు ఆ నినాదాన్ని ప్రతిధ్వనింపజేశారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధాని మోదీ (Narendra Modi) కీలక సూచన చేశారు. మనమంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని ‘మోదీ కా పరివార్‌’ సమర్థంగా చాటిచెప్పిందని, ఇప్పుడు దీన్ని తొలగించాల్సిందిగా ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు.

3.Oలో మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే..?

‘‘ఎన్నికల సమయంలో నామీద అభిమానానికి గుర్తుగా ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతా పేర్లలో ‘మోదీ కా పరివార్’ చేర్చారు. ఇది నాకు చాలా శక్తినిచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి ఎన్డీయేకు విజయం కట్టబెట్టారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలంటూ అధికారం అప్పగించారు. ‘మనమంతా ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని చాటిచెప్పినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ నినాదాన్ని తొలగించాలని కోరుతున్నా. దీంతో డిస్‌ప్లే పేరు మారవచ్చేమో.. కానీ, దేశ పురోగతి కోసం పరిశ్రమిస్తోన్న కుటుంబంగా మన బంధం మాత్రం చెక్కుచెదరదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ప్రొఫైల్‌ పిక్చర్‌, కవర్‌ ఇమేజ్‌లను కూడా మార్చారు. నూతన మంత్రివర్గంతో దిగిన ఫొటోను కవర్‌ ఇమేజ్‌గా ఉంచారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం ‘ఎక్స్‌’ అకౌంట్‌లో ఇదే విధమైన మార్పులు చేపట్టింది. రాజ్యాంగానికి మోదీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు కనిపిస్తోన్న ఫొటోను కవర్‌ ఇమేజ్‌గా ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని