Gaganyaan: అంతరిక్షానికి వెళ్లే భారతీయులు వీరే.. వ్యోమగాముల పేర్లు ప్రకటించిన మోదీ

మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌(Gaganyaan) లో పర్యటించే వ్యోమగాముల పేర్లను మోదీ ప్రకటించారు. 

Updated : 27 Feb 2024 13:30 IST

తిరువనంతపురం: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ (Gaganyaan) కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు.

కౌంట్‌డౌన్‌ మనదే.. రాకెట్ మనదే: మోదీ

కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ.. స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు. ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. గతంలో రాకేశ్‌శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు.

ఇక, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్న తరుణంలో.. గగన్‌యాన్‌ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమని తెలిపారు.

ఈ వ్యోమగాముల బృందం కొద్దికాలం రష్యాలో శిక్షణ పొందారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ వారిని సుశిక్షితులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. వారిని రోదసిలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. అలాగే సాంకేతిక విభాగాల్లోనూ పట్టు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని