Modi: మతిస్థిమితం లేనివారి నోటినుంచే ఇలాంటి మాటలు: రాహుల్‌పై మోదీ తీవ్ర వ్యాఖ్యలు

యూపీ ప్రజలను రాహుల్ గాంధీ(Rahul Gandhi) అవమానించారని, వారు దానిని ఎప్పటికీ మర్చిపోరని ప్రధాని మోదీ(Modi) అన్నారు. 

Updated : 23 Feb 2024 18:17 IST

వారణాసి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధాని మోదీ(Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి(Varanasi)లో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్నవారిని చూశానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ స్పందన వచ్చింది. ఈమేరకు ఆయన తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

‘మతిస్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని నా పిల్లల్ని తాగుబోతులు అంటారు. అసలు అదేం భాష..? మోదీని దుర్భాషలాడుతూ రెండు దశాబ్దాలు గడిపారు. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ యువతపై తమ చిరాకును వెళ్లగక్కుతున్నారు. యూపీ యువత లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోం. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుంది.  అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించదు. రామమందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ అసలు ఊహించలేదు. కాశీ, అయోధ్యలో వస్తోన్న మార్పు ‘ఇండియా’ కూటమి అశాంతికి కారణం’ అని విమర్శించారు. అలాగే ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయవని దుయ్యబట్టారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.

ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్‌.. ఇదే ‘మోదీ గ్యారంటీ’!

ప్రతిసారి ఎన్నికల సమయంలో విపక్ష నేతలు కలిసివస్తారని ‘ఇండియా’ కూటమిని ఉద్దేశించి మాట్లాడారు. దానివల్ల ఫలితం శూన్యమైతే.. వారు ఒకరినొకరు నిందించుకుంటారని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో భాజపా భారీ విజయాన్ని నమోదు చేస్తుందని, అన్ని సీట్లు ఎన్డీయేకే దక్కుతాయని ధీమా వ్యక్తంచేశారు. మూడోసారి తమ ప్రభుత్వం దేశాన్ని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. దీనికి ముందు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో భారత్‌ అభివృద్ధికి నమూనాగా మారుతుందని, ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని అభివర్ణించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని