PM Modi: 758 సార్లు సొంత పేరే తలుచుకున్నారు.. మోదీ ప్రచార తీరుపై ఖర్గే విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Updated : 30 May 2024 16:54 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన ప్రసంగాల్లో 421 సార్లు మతపర, విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని ఉల్లంఘించారన్నారు. లోక్‌సభ ఎన్నికల తుదిదశ ప్రచారానికి చివరిరోజైన గురువారం ఆయన దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ప్రత్యామ్నాయ సర్కారు ఏర్పడేలా ప్రజలు తీర్పు ఇస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు.

‘‘గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో 232 సార్లు కాంగ్రెస్‌ పేరును ప్రస్తావించారు. 758 సార్లు సొంత పేరునే తలుచుకున్నారు. నిరుద్యోగ సమస్య గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు’’ అని ప్రధాని ప్రచార తీరును ఖర్గే ఎండగట్టారు. స్పష్టమైన ఆధిక్యంతో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ.. దేశానికి సమ్మిళిత, జాతీయవాద ప్రభుత్వాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తే ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం ఖాయమనే అభిప్రాయం ప్రజల్లోనూ వ్యక్తమవుతోందన్నారు.

75 రోజులు.. 180 ర్యాలీలు.. మోదీ ప్రచార సునామీ!

గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఖర్గే కొట్టిపారేశారు. ‘‘గాంధీ గురించి బహుశా ఆయన చదివి ఉండకపోవచ్చు. కానీ, మహాత్ముడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఐరాస సహా వివిధ ప్రదేశాల్లో బాపూజీ విగ్రహాలు ఉన్నాయి. ఒకవేళ మోదీకి గాంధీ గురించి తెలియకపోతే.. రాజ్యాంగం గురించి కూడా పెద్దగా తెలియనట్లే. జూన్ 4 తర్వాత ఎలాగో చాలా ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు గాంధీ ఆత్మకథ చదివి, ఆయన గురించి తెలుసుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని