PM Modi: సందేశ్‌ఖాలీ బాధిత మహిళలతో ప్రధాని మోదీ భేటీ..!

ప్రధాని మోదీ మార్చి 6న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated : 22 Feb 2024 17:53 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటనలో బాధిత మహిళలను ప్రధాని మోదీ (PM Modi) కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. మార్చి 6న బరాసత్‌ (Barasat)లో భాజపా (BJP) మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో మోదీ పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్‌ తెలిపారు. ఒకవేళ సందేశ్‌ఖాలీలోని మాతృమూర్తులు, సోదరీమణులు ప్రధానిని కలవాలనుకుంటే  అందుకు ఏర్పాటు చేస్తామన్నారు.

గత కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఈ ఉదంతం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ ఘటన గురించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. భాజపా నిరసనకారులను రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనను కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. 

బెంగాల్‌ ప్రభుత్వ అప్పీలును తిరస్కరించిన హైకోర్టు

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బాధిత మహిళలకు మద్దతుగా భాజపా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

అనంతరం బాధితులను కలిసేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భాజపా ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రివిలేజెస్‌ కమిటీ.. పశ్చిమబెంగాల్‌ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌, భాజపా ఎంపీ సుకాంత, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ఈ హింసలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న షాజహాన్‌ షేక్‌ను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం విస్మయం కలిగిస్తోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిని రక్షిస్తున్నారా లేదా అన్న విషయం తెలియదు కానీ, అతడిని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని