ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు మాతృత్వాన్ని పంచిన పోలీసమ్మ..!

నాలుగు నెలల పసికందు పట్ల ఓ మహిళా పోలీసు(Kerala Police Officer) చూపిన చొరవ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 

Updated : 24 Nov 2023 15:03 IST

కొచ్చి: ఒకవైపు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు తండ్రి జైల్లో మగ్గుతున్నాడు. వారి నాలుగునెలల పసికందు ఆకలి తీర్చేవారు లేక గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దయనీయ పరిస్థితి చూపరుల హృదయాలను మెలిపెట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా పోలీసు (Kerala Police Officer) ఆ పసికందును అలా చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే అక్కున చేర్చుకొని పాలుపట్టి ఆ పసికందు క్షుద్బాధను తీర్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

పట్నాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో కేరళ(Kerala)లోని ఎర్నాకుళం జనరల్‌ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు నలుగురు పిల్లలు. వారిలో నాలుగునెలల పసికందు కూడా ఉంది. తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో ఆ చిన్నారులు ఆలనాపాలనా చూసేవారు కరవయ్యారు. దాంతో వారు సంరక్షణా కేంద్రానికి వెళ్లడానికి ముందు.. కొద్దిసేపు కొచ్చిలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. వారిలో కొంచెం పెద్ద పిల్లలకు పోలీసులు ఆహారం అందించగా..  మహిళా పోలీసు ఆర్య మాత్రం నెలల బిడ్డకు తన పాలు ఇచ్చి ఆకలి తీర్చారు. ఆమె విధులకు మించి మానవత్వంతో వ్యవహరించిన తీరు, చూపిన ఆదరణ ఉన్నతాధికారుల్ని మెప్పించింది. ఆమె చొరవను అభినందించారు. ఆర్యకు కూడా తొమ్మిది నెలల బిడ్డ ఉంది. అందుకే ఆ పసికందు బాధను అర్థం చేసుకొంది. 

ఇదిలా ఉంటే.. పట్నాకు చెందిన సదరు మహిళ కుటుంబం కొద్దికాలంగా కేరళలో నివసిస్తోంది. ఒక కేసులో ఆమె భర్త జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారుల్ని మహిళా పోలీసు స్టేషన్ నుంచి బాలల సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని