Bangla MP Murder: వలపు వలతో చంపి.. చర్మాన్ని ఒలిచి: బంగ్లా ఎంపీ హత్య కేసులో వెలుగులోకి దారుణాలు

Bangla MP Murder: బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య వెనుక వలపు వల కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను ట్రాప్‌లోకి లాగి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని అతిదారుణంగా ఛిద్రం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated : 24 May 2024 12:46 IST

కోల్‌కతా: చికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌కు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ (Anwarul Azim Anar) కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. హత్య (Bangladesh MP Murder) అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. దానిపై చర్మాన్ని ఒలిచి.. ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అన్వర్‌ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్‌హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత తిరిగిరాలేదని గుర్తించారు. ‘‘బంగ్లా ఎంపీని ఓ మహిళతో హనీట్రాప్‌ చేయించి ఆ అపార్ట్‌మెంట్‌లోకి రప్పించి ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలే. ఫ్లాట్‌లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నాం’’ అని బెంగాల్‌ సీఐడీ (West Bengal CID) అధికారి ఒకరు వెల్లడించారు.

ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను పరిశీలిస్తే ఎంపీని గొంతునులిమి చంపినట్లు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నారు. ‘‘ఆయన చర్మాన్ని వేరు చేశారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు శరీర భాగాలకు పసుపు కలిపి పెట్టినట్లుగా అనిపిస్తోంది. కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరించాం. అక్కడి నుంచి నమూనాలను సేకరించాం. ఎంపీ శరీర భాగాలను ప్లాస్టిక్‌ బ్యాగుల్లో తీసుకుని వివిధ ప్రదేశాల్లో పడేసి ఉంటారు’’ అని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చిన వలసదారు జిహాద్‌ హవల్దార్‌ను పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. ఈ ఘోరంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీల్లేకుండా ఛిద్రం చేసినట్లు నిందితుడు హవల్దార్‌ అంగీకరించాడు. ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తరుజమాన్‌ (ఇతను ఎంపీ పాత స్నేహితుడు) అని బయటపెట్టాడు. అతడి ఆదేశాలతోనే తాను ఈ పనిచేసినట్లు విచారణలో చెప్పాడు’’ అని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

మహమ్మద్‌ అనర్‌ మే 12న కోల్‌కతా శివారులో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఆ మరుసటి రోజు పని ఉందని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఎంపీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించగా.. వారం తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా.. ఇంతవరకు మృతదేహం దొరకలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు