Loksabha Elections: ఎన్నికల ప్రచారం వయా సోషల్‌ మీడియా

ఎన్నికల ప్రచార పంథా మారిపోయింది. కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం స్థానంలో సోషల్‌ మీడియాతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

Updated : 17 Mar 2024 14:51 IST

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ (LokSabha Elections 2024)కు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. ఇందులో సామాజిక మాధ్యమాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర. గతంలో ఓట్ల కోసం కరపత్రాల పంపిణీ, సభల నిర్వహణ, గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలవడం ఇలా సాగేది ప్రచారం. ఇప్పుడు పంథా మారిపోయింది. ఇన్ఫర్మేషన్‌,  కమ్యూనికేషన్ టెక్నాలజీ (ITC) అభివృద్ధి చెందడంతో సోషల్‌ మీడియా ప్రధాన ప్రచార మాధ్యమంగా మారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియా లేకుండా గెలవలేవమని చాలా పార్టీలు భావిస్తున్నాయట. 

పాడ్‌కాస్ట్‌లకు డిమాండ్‌ 

ప్రస్తుతం దేశంలో స్మార్ట్‌ఫోన్‌లు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తక్కువ ధరకే డేటా లభిస్తోంది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉదయం లేచింది మొదలు నిరంతరం తమ స్మార్ట్ ఫోన్లలో ఏదో ఒక సోషల్‌ మీడియాలో వీళ్లు కంటెంట్‌ చూస్తున్నారు. ఇదే అంశం పార్టీలకు సానుకూలంగా మారింది. వీటితోపాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పార్టీలోని ముఖ్య నాయకులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. యూట్యూబ్‌ ద్వారా పార్టీ ప్రధాన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత కొద్ది నెలలుగా కేంద్ర మంత్రులు జైశంకర్‌, స్మృతి ఇరానీ, పీయూష్‌ గోయల్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌లు ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. దానికి సుమారు ఏడు మిలియన్‌ ఫాలోవర్స్ ఉన్నారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీ కూడా మరో పాడ్‌కాస్ట్ ఛానల్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు. 

వాట్సాప్, ఫేస్‌బుక్‌లదే హవా

ఓటర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు ‘లెటర్‌ ఫ్రమ్‌ ది ప్రైమ్‌ మినిస్టర్‌’ పేరుతో భాజపా వాట్సాప్‌లో ఓ లేఖను ప్రచారం చేస్తోంది. దాంతోపాటు ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ మోదీ’ పేరుతో వెబ్‌ పేజ్‌ను ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ క్రియేట్‌ చేసింది. అందులో ఆయన నేరుగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారని ప్రచారం చేస్తోంది. ఎక్కువ వాట్సాప్‌ గ్రూప్‌లు ఉంటే సులువుగా ప్రజలను చేరుకోవచ్చని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా ఫేస్‌బుక్‌నే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని ఎన్నికల విశ్లేషకుడు అమితాబ్‌ తివారీ తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం ఫేస్‌బుక్‌కు 36.6 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. ఇవికాకుండా..  ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌, యూట్యూబ్‌ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లేకుండా గెలుపు కష్టం!

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. కొవిడ్‌-19 పరిస్థితుల తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీ అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయని అమితాబ్‌ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా, నియోజకవర్గాలకు బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇందులో మరింత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను నేరుగా కలవకుండా.. ఏఐ సాంకేతికతతో వారితో నేరుగా సంభాషించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రముఖులు, సినిమా తారలతో ప్రచారం చేయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని