Elections:: ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్‌ సిబ్బంది రెడీ!

అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్‌ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated : 27 Mar 2024 19:18 IST

ఇటానగర్‌: ప్రజాస్వామ్య పండగగా పరిగణించే ఎన్నికల్లో ప్రతిఒక్క ఓటరును భాగస్వామిని చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతోన్న ఎన్నికల సంఘం (Election Commission).. మారుమూల ప్రాంతాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలను అందుబాటులో ఉంచుతోంది. ఏ ఒక్క ఓటరూ పోలింగ్‌కు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోన్న ఈసీ.. ఒక్క ఓటరు ఉన్నా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈక్రమంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్‌ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు.

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)తోపాటే అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 18న జరగనున్నాయి. ఇక్కడి అంజావ్‌ జిల్లాలోని మాలెగావ్‌ అనే మారుమూల గ్రామం.. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. అరుణాచల్‌ ఈస్ట్‌ లోక్‌సభ, హుయులియాంగ్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ వారంతా వేరే పోలింగ్‌బూత్‌ పరిధిలోకి మారిపోయారు. సొకేలా తయాంగ్‌ (44) అనే మహిళ మాత్రం అందుకు నిరాకరించారు. దాంతో ఆమెకోసం తాత్కాలికంగా ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఎత్తైన పర్వతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే ఆ ప్రాంతాన్ని చేరుకునేందుకు నడక ఒక్కటే మార్గం. ఇందుకోసం పోలింగ్‌, భద్రతా, పోర్టర్లలతో కూడిన ఎన్నికల సిబ్బంది సాహసయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో

2014 ఎన్నికల సమయంలో మాలెగావ్‌ గ్రామంలో రెండు ఓట్లు ఉండేవి. ఒకటి తయాంగ్‌, మరొకటి ఆమె భర్త ఓటు. ఆయన అదే నియోజకవర్గంలో వేరే బూత్‌కు మార్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం తాను ఆయనతో కలిసి ఉండటం లేదని, ఎక్కడ ఉన్నాడో తెలియదని తయాంగ్‌ వివరించారు. పక్క జిల్లా వ్యవసాయ క్షేత్రంలో పిల్లలతో కలిసి ఉంటోన్న ఆమె.. పోలింగ్‌ రోజు సాయంత్రానికి తన గ్రామానికి తప్పకుండా చేరుకుంటానని చెప్పడం గమనార్హం. పోలింగ్‌ రోజు తయాంగ్‌ ఎప్పుడు వచ్చి ఓటు వేస్తారో తెలియనందున.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రం అందుబాటులో ఉంటుందని స్థానిక ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని