Kashmir: ఆ రెండు దాడులు చేసింది.. అదే ఉగ్ర ముఠా..!

రాజౌరీ, పూంచ్‌లో ఉగ్ర ఘటనలకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులకు స్థానికంగా ఉన్న ఓ మాజీ నేరగాడు సాయం చేసినట్లు తెలిసింది. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని అరెస్టు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి.

Published : 27 Nov 2023 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: పూంచ్‌, రాజౌరీలో జరిగిన ఉగ్రదాడులను ఒకే ఉగ్ర ముఠా చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరికి స్థానికంగా ఉన్న లష్కరే తోయిబా హ్యాండిలర్లు సాయం చేసినట్లు తెలుస్తోంది. తొలుత జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడ ఉన్న ఓ ఇంటిలో ఐఈడీని దుండగులు అమర్చారు. మర్నాడు అది పేలి మరో ఇద్దరు చనిపోయారు.

ఈ ఘటనపై దర్యాప్తు బృందాలు కీలక విషయాలను గుర్తించాయి. తొలుత దాడి చేసిన ప్రదేశాన్ని సీనియర్‌ అధికారులు పరిశీలించేందుకు వచ్చినప్పుడు పేల్చేందుకు వీలుగా ఆ ఐఈడీని అమర్చినట్లు తేల్చారు. దీనిపై రాజౌరీలో కేసు నమోదు చేయగా.. తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ఇక ఎన్‌ఐఏ దర్యాప్తులో స్థానికంగా ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి పాత్ర బయటపడింది.

ఈ సందర్భంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిస్సార్‌ అహ్మద్‌, ముస్తాక్‌ హుస్సేన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో నిస్సార్‌ మాత్రం లష్కరే హ్యాండ్లర్‌ అబూ ఖతాల్‌ అలియాస్‌ ఖతాల్‌ సంధితో టచ్‌లో ఉండేవాడు. గతంలో నిస్సార్‌ ఉగ్రవాదం కేసులో అరెస్టయ్యాడు. రెండేళ్లు జైలు జీవితం తర్వాత 2014లో విడుదలయ్యాడు. గత మూడేళ్ల నుంచి ఇతడు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నాడు. ధోంగ్రీలో దాడి తర్వాత పోలీసులు ఇతడిపై అనుమానంతో ప్రశ్నించారు.

కొండగుహలో ఉగ్రవాదులకు ఏర్పాట్లు..

ఇక జాతీయ దర్యాప్తు సంస్థ నిస్సార్‌ను తమదైన శైలిలో విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లష్కరే హ్యాండ్లర్‌ ఖతాల్‌ సూచన మేరకు ఇద్దరు ఉగ్రవాదులు ఉండేందుకు ఓ కొండగుహలో ఏర్పాట్లు చేయించాడు. ఇందుకోసం ముస్తాక్‌ హుస్సేన్‌కు రూ.75,000 నగదును చెల్లించాడు. ఇక ఉగ్రవాదులకు నిత్యం తన ఇంటి నుంచి అక్కడికి ఆహారం పంపించేవాడు. ఏప్రిల్‌లో పూంచ్‌ జిల్లాలో సైనిక వాహనంపై దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు 22 రొట్టెలు కావాలని నిస్సార్‌ను కోరారు. ఆ తర్వాత కొండగుహ నుంచి అదృశ్యమైపోయారు. రెండు రోజుల తర్వాత భీంబెర్‌ గలీ-సురాన్‌కోట్‌ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్‌ వాహనంపై దాడి చేసి ఐదుగురు జవాన్లను హత్యచేశారు. ఈ ఘటనపై వేర్వేరు ప్రాంతాల నుంచి ఎన్‌ఐఏ సమీకరించిన ఇంటెలిజెన్స్‌ మొత్తాన్ని కలిపి చూడగా.. జనవరిలో ధోంగ్రీ గ్రామంపై దాడి చేసిన ఇద్దరు ఉగ్రవాదులు, పూంచ్‌లో సైనిక వాహనంపై దాడిచేసిన వారు ఒక్కరే అని తేలింది. వీరు  పాక్‌లోని లష్కరే నాయకుడు సైఫుల్లా అలియాస్‌ సాజిద్‌ జుట్‌, అబూ ఖతాల్‌, మహమ్మద్‌ ఖాసిం సూచనల మేరకు దాడులు చేసినట్లు గుర్తించారు.

రాజౌరీ జిల్లా కాలాకోట్‌ అడవుల్లో బుధవారం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం భద్రతా బలగాలు లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ సహా మరో ఉగ్రవాదిని హతమార్చాయి. మృతి చెందిన కమాండర్‌ను క్వారీగా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. ధోంగ్రీ గ్రామంపై ఉగ్రదాడికి ఇతడే మాస్టర్‌ మైండ్‌ అని చెబుతున్నాడు. ఇతడు దాక్కొన్న గుహను కూడా అధికారులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని