‘స్కాన్‌ చేయండి.. స్కామ్‌లు చూడండి’: భాజపాపై పోస్టర్ల కలకలం

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రాన్ని విమర్శిస్తూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. 

Published : 11 Apr 2024 18:51 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక మొదటి దశ ఓటింగ్ సమీపిస్తుండగా.. ఆ వేడి మరింత పెరిగింది. ఈ సమయంలో తమిళనాడు (Tamil Nadu)లో కొన్ని పోస్టర్లు (posters) కలకలం సృష్టిస్తున్నాయి. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఇవి వెలిశాయి.

ఆ పోస్టర్ల పైభాగంలో ‘జై పే’ అని రాసిఉంది. ఆ తర్వాత మోదీ ఫొటో, క్యూర్‌ కోడ్ దర్శనమిచ్చింది. ‘స్కాన్‌ చేసి, స్కామ్‌లు చూడండి’ అని కింద ఒక లైన్ జత చేసి ఉంది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. యూజర్లకు ఒక వీడియో కనిపిస్తుంది. దానిలో కేంద్రంపై అవినీతి ఆరోపణలు చూస్తూ ఒక గొంతు వినిపించింది. ఎన్నికల బాండ్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి నుంచి కొందరు పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయలను భాజపా ప్రభుత్వం మాఫీ చేసిందంటూ ఆరోపించింది.

అందుకే ఓటర్లు భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని, విపక్ష ‘ఇండియా’ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ పోస్టర్లు డీఎంకే పార్టీ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దానిపై ఎలాంటి స్పష్టతా లేదు. ఇదిలాఉంటే.. ఏప్రిల్ 19 నుంచి జూన్‌ ఒకటి వరకు ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. తొలివిడతలోనే తమిళనాడులో 39 స్థానాలకు పోలింగ్ పూర్తికానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని