Budget Session: ‘గరీబీ హఠావో’ నినాదం వింటూనే ఉన్నాం.. కానీ’: బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం

Budget Session: భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు.

Updated : 31 Jan 2024 12:35 IST

దిల్లీ: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Session) ప్రారంభమయ్యాయి. నూతన భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రసంగించారు. కొత్త పార్లమెంట్‌లో ఇదే తన తొలి ప్రసంగం అని తెలిపారు. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని కొనియాడారు.

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..

  • శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. భగవాన్‌ బిర్సా ముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నాం. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటు కానుంది. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం.
  • గతేడాది మన దేశం ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. జీ20 సమావేశాలను ఘనంగా నిర్వహించుకున్నాం.
  • ఆసియా క్రీడల్లో తొలిసారి 107, పారా క్రీడల్లో 111 పతకాలను సాధించాం. తొలిసారిగా నమోభారత్ రైలును ఆవిష్కరించాం. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా ‘నారీశక్తి వందన్ అధినియమ్‌’ బిల్లును ఆమోదించుకున్నాం.
  • మన చిన్నతనం నుంచీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ, జీవితంలో తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోంది.
  • శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆలయాన్ని ప్రారంభించాం.
  • దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదంతో ముందుకెళ్తున్నాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. యూపీ, తమిళనాడులో రక్షణ కారిడార్‌లు ఏర్పాటయ్యాయి. రక్షణ రంగ ఉత్పత్తులు భారత్‌లో తయారవడం గర్వకారణం.
  • ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ఆత్మనిర్భరత, మేకిన్‌ ఇండియా మన బలాలుగా మారాయి.
  • ఇటీవల యావత్‌ ప్రపంచం కరోనా వంటి మహమ్మారిని, యుద్ధాలను చవిచూసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలపై భారం పడకుండా చూసుకున్నాం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాం. కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించాం. 
  • రైతులకు పెట్టుబడి భారం తగ్గించి.. లాభాలను అందించడమే మా లక్ష్యం. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం.
  • ఉజ్వల కనెక్షన్లు పది కోట్లు దాటాయి. రూ.7లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం. సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం.
  • ఆవాస్‌ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం. 4.10కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం. పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం.
  • మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. 2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం.
  • యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నాం.
  • సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఉగ్రవాదం, విస్తరణవాదానికి మన దళాలు గట్టిగా బదులిస్తున్నాయి. నక్సల్‌ ఘటనలు భారీగా తగ్గాయి. జమ్మూకశ్మీర్‌లో సురక్షిత పరిస్థితులు నెలకొన్నాయి.
  • గ్రీన్‌ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం. సౌర విద్యుదుత్పత్తిలో మన దేశం ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో లక్షకు పైగా స్టార్టప్‌లు ఏర్పాటు చేశాం.
  • పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాం. అండమాన్‌, లక్షద్వీప్‌ వంటి ప్రాంతాలపై పర్యాటకులకు ఆసక్తి పెరిగింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత 13లక్షల మంది బాలక్‌రామ్‌ను దర్శించుకున్నారు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని