Womens Day: అతివ ఆలోచన.. సంపన్న దేశాన్ని సృష్టించగలదు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు దేశ మహిళలకు శుభకాంక్షలు తెలియజేశారు.

Published : 08 Mar 2023 10:50 IST

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నప్పటికీ.. లింగ సమానత్వం కోసం ఇంకా కృషి చేయాల్సిన అవసరముందని భారత ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) పురస్కరించుకుని ఆమె దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఇంటికే కాదు.. యావత్‌ దేశానికి గర్వకారణమని తెలిపారు. అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా నారీశక్తిని కొనియాడారు.

* ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని రికార్డులు సాధిస్తున్నారు. నాయకత్వ స్థానాల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. వారి ఆలోచనలు, విలువలు.. సంతోషకరమైన కుటుంబాన్ని, ఆదర్శవంతమైన సమాజాన్ని, సంపన్న దేశాన్ని తయారుచేయగలవు. లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించడానికి మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరముంది. నాణ్యమైన విద్య ద్వారా మన ఆడబిడ్డలను మరింత శక్తిమంతం చేసేందుకు దేశం కట్టుబడి ఉంది. మన ఆడపిల్లలు మన కుటుంబాలకు కాదు.. యావత్‌ దేశానికే గర్వకారణం. అతివల భవిష్యత్తు మరింత సంతోషకరంగా ఉండాలని, వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ - రాష్ట్రపతి (President) ద్రౌపదీ ముర్ము

* ‘‘దేశ నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన జీవితంలో అతివల సహకారాన్ని గుర్తించడానికి ఇది ఒక సందర్భం. మహిళా సాధికారతతోనే సమాజ సాధికారత. మెరుగైన ప్రపంచ నిర్మాణం కోసం మన సోదరీమణులు, కుమార్తెలకు అండగా నిలబడాలనే సంకల్పంతో ముందుకెళ్దాం’’ - ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar)

* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మన నారీ శక్తి సాధించిన విజయాలకు అభినందనలు. దేశ పురోభివృద్ధిలో మహిళల పాత్రకు మేం ఎంతో గర్విస్తున్నాం. మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది - ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)

* నారీ శక్తికి యావత్ భారతం గర్విస్తోంది. దేశ నిర్మాణంలో వారి త్యాగాలు అనంతరం. వారి ధైర్యం, సాహసం, దృఢ సంకల్పం మనలో ఎంతో స్ఫూర్తి నింపుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ సెల్యూట్‌ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని