Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్‌’ ప్రదానం

పద్మ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

Updated : 09 May 2024 19:12 IST

దిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం(Republic Day celebrations) వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల (Padma awards 2024) ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఈ అవార్డులను అందజేసి గౌరవించారు. ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం దాదాపు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. మిగతావారికి వచ్చే వారం ఇచ్చే అవకాశం ఉంది.  

వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబసభ్యులకు పద్మవిభూషణ్‌ అవార్డును అందజేశారు.  సినీనటుడు మిథున్‌ చక్రవర్తి, మాజీ గవర్నర్‌ రామ్‌నాయక్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌ పద్మభూషణ్‌ పురస్కారం స్వీకరించగా.. తెలంగాణలోని నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని