SBI: ‘ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఇచ్చేశాం’: సుప్రీంలో ఎస్‌బీఐ అఫిడవిట్‌

సీరియల్ నంబర్లతో సహా ఎన్నికల బాండ్ల (Electoral Bonds) వివరాలను ఈసీకి ఎస్‌బీఐ అందజేసింది. 

Updated : 21 Mar 2024 16:54 IST

దిల్లీ: ఎన్నికల బాండ్ల (Electoral Bonds) వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో భారతీయ స్టేట్ బ్యాంక్‌(SBI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీరియల్‌ నంబర్లతో సహా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఈమేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎలక్షన్‌ కమిషన్‌కు అందజేశాం. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకు ఖాతాల నంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదు’’ అని పేర్కొంది.

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది.

‘వాట్సప్‌లో వికసిత భారత్‌ సందేశాలు ఆపండి’: కేంద్రానికి ఈసీ ఆదేశం

ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను (నంబర్లతో సహా) ఈసీకి ఇచ్చేశామని చెబుతూ మార్చి 21 (గురువారం) సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే బ్యాంకు వివరాలు సమర్పించింది. వాటిని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని