Pune Car Crash: పుణె కారు ప్రమాదం..దర్యాప్తునకు 100మంది పోలీసులు

పుణె కారు ప్రమాదం కేసులో దర్యాప్తును వేగవంతం చేయడానికి 100మంది సిబ్బందితో కూడిన బృందాలను రంగంలోకి దింపినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Published : 02 Jun 2024 11:46 IST

పుణె: మహారాష్ట్రలోని పుణె (Pune)లో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune Porsche Crash)లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విస్తృత స్థాయి దర్యాప్తులో భాగంగా తాజాగా 100 మంది సిబ్బందితో కూడిన డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ బృందాలు కేసును వివిధ కోణాల నుంచి దర్యాప్తు చేయనున్నాయని పేర్కొన్నారు. 

‘‘దర్యాప్తును వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి అనేక బృందాలను నియమించాము. ఉన్నతాధికారులతో సహా సుమారు 100 మంది పోలీసులు ఈ కేసును వివిధ కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తునకు 8 -10 మంది సిబ్బందితో మూడు బృందాలు, కేసును డాక్యుమెంటేషన్ చేసేందుకు రెండు బృందాలు, సీసీటీవీ ఫుటేజీ పర్యవేక్షణకు ఒక బృందం, సాంకేతిక విశ్లేషణ కోసం మూడు బృందాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాల కోసం అనేక బృందాలను ఏర్పాటు చేశాం’’ అని అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్) శైలేష్ బాల్కవాడే(Shailesh Balkawade) తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే సరైన లైసెన్స్ లేకుండా కారు నడపడానికి అనుమతించినందుకు బాలుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ డ్రైవర్‌ను కేసులో ఇరికించడానికి ప్రయత్నించిన నిందితుడి తాతను, బాలుడి రక్త నమూనాలకు బదులుగా తన రక్త నమూనాలను ఇచ్చిన అతడి తల్లిని, దీనికి సహకరించిన ఇద్దరు వైద్యులను, ఓ ఉద్యోగిని, రెండు బార్‌ల యజమానులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు