Punjab: పంజాబ్‌లో ‘గుర్బానీ’ వివాదం.. ప్రభుత్వంపై మండిపడుతున్న విపక్షాలు

స్వర్ణదేవాలయంలో పఠించే గుర్బానీని అందరూ ఉచితంగా వీక్షించేలా పంజాబ్‌(Punjab) ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై సోమవారం కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనుంది.

Updated : 19 Jun 2023 12:15 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌(Punjab CM Bhagwant Mann) చేసిన ట్వీట్‌ రాజకీయంగా దుమారం రేపుతోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం(Golden Temple) నుంచి గుర్బానీ(Gurbani)ని అందరికీ ఉచితంగా ప్రసారం చేస్తామంటూ సీఎం చేసిన ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ మేరకు గురుద్వారా చట్టం, 1925ను సవరించనున్నట్లు సీఎం ఆదివారం వెల్లడించారు. ఈ తీర్మానాన్ని మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 

గుర్బానీ అనేది ఒక పవిత్ర శ్లోకం. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తుంటారు. అయితే ఒక ప్రైవేటు ఛానల్ వద్ద మాత్రమే దీని ప్రసార హక్కులు ఉన్నాయి. దీనిని ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా.. అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు సీఎం(Bhagwant Mann) ఆదివారం ట్వీట్ చేశారు. ‘భవంతుడి ఆశీస్సులతో మేం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నాం. భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు సిక్కు గురుద్వారా చట్టానికి కొత్తగా ఒక క్లాజ్‌ చేరుస్తున్నాం. దీనిద్వారా స్వర్ణదేవాలయానికి చెందిన గుర్బానీ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం. అలాగే జూన్‌ 20న అసెంబ్లీలో ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నాం’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రకటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(SGPC).. గుర్బానీ(Gurbani) ప్రసార హక్కుల్ని పీటీసీ నెట్‌వర్క్‌కు కట్టబెట్టింది. ఈ నెట్‌వర్క్‌ రాజకీయంగా శక్తిమంతమైన బాదల్‌ కుటుంబానికి చెందినది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం.. ఆ నెట్‌వర్క్‌ గుత్తాధిపత్యాన్ని నియంత్రించే ఉద్దేశంగా కనిపిస్తోంది. దాంతో ఎస్‌జీపీసీ, బాదల్‌ కుటుంబం, అకాలీదళ్ ఈ ప్రకటనపై మండిపడుతున్నాయి. ఈ తీరు రాజ్యాంగ విరుద్ధమైందని, మతపరమైన  కార్యకలాపాల్లో ప్రత్యక్ష జోక్యమని విమర్శిస్తున్నాయి. సిక్కుగురుద్వారా చట్టాన్ని పార్లమెంట్ చేసిందని, దానిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయలేదని భాజపా, కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు