Punjab University: ఇకపై విద్యార్థినులకు నెలసరి సెలవులు: పంజాబ్‌ యూనివర్సిటీ

చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ(పీయూ) 2024-25 వార్షిక సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. 

Published : 12 Apr 2024 20:14 IST

పంజాబ్‌: చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ(పీయూ) 2024-25 వార్షిక సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. పీయూ వైస్ ఛాన్స్‌లర్‌ రేణువిగ్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు, షరతులను విధించారు. అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్థులు ఒక సెమిస్టర్‌కు గరిష్టంగా నాలుగు లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ లేదా ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయరు. రుతుక్రమ సెలవులు పొందేందుకు విద్యార్థులు స్వీయ ధృవీకరణ ఆధారంగా ఫారంను నింపి డిపార్టుమెంట్‌ ఛైర్‌పర్సన్‌ లేదా డైరెక్టర్‌ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. 

పంజాబ్ విశ్వవిద్యాలయం డీన్ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ మొదటి సమావేశం జనవరి 24న జరగ్గా రుతుక్రమ సెలవుల మంజూరును విశ్వవిద్యాలయ ప్రధాన కార్యదర్శి దీపక్ గోయత్, ఉపాధ్యక్షురాలు రణ్‌మీక్‌జోత్ కౌర్ వ్యతిరేకించారు. ఈ విధానాన్ని అమలుచేస్తున్న ఆరు విశ్వవిద్యాలయాల నుంచి ప్రతిపాదనలను సమర్పించారు. వాటిని అధ్యయనం చేసిన అనంతరం ఒక విధానాన్ని రూపొందించడానికి ఫిబ్రవరి 15న సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు.

ఇదిలాఉండగా, కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలోనే మొదటిసారిగా 2023 జనవరిలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులను ప్రకటించింది. అనంతరం హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, అస్సాంలోని గుహవాటి విశ్వవిద్యాలయం, తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం తమ విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని