Sidhu Moosewala: 58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్న సిద్ధూ మూసేవాలా తల్లి..!

Sidhu Moosewala: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి తన 58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

Updated : 27 Feb 2024 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దివంగత పంజాబీ గాయకుడు (Punjabi singer) సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) తల్లిదండ్రులు త్వరలోనే తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి చరణ్‌ కౌర్‌ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారట. ఈ మేరకు కుటుంబ వర్గాలు తెలిపినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న  హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుండగులు అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన వారు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్‌ ద్వారా ఇటీవల చరణ్‌ కౌర్‌ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు తెలిపారు. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కౌర్‌ వయసు 58 ఏళ్లు కాగా.. సిద్ధూ తండ్రి బాల్‌కౌర్‌ సింగ్‌ వయసు 60ఏళ్లు.

సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ.. 2021 డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరారు. 2022లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘తేరీ మేరీ జోడీ’, మోసా జఠ్‌.. వంటి చిత్రాల్లోనూ నటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధూ తండ్రి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని