భారీ అగ్ని ప్రమాదం.. పక్కనే ఉన్నా వెళ్లని ₹5.5 కోట్ల ఫైర్‌ ఇంజిన్‌!

భోపాల్‌లో ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవనంలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పక్కనే ఓ అత్యాధునిక ఫైర్‌ ఇంజిన్‌ నిలిపి ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంటలను అదుపు చేసేందుకు ఆ ఫైర్‌ ఇంజిన్‌ను వినియోగించపోవడంపై పలువురు సందేహాం వ్యక్తం చేస్తున్నారు.

Published : 14 Jun 2023 01:34 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌ (Bhopal)లో ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఏడంతస్తుల భవనంలో కీలక ప్రభుత్వ శాఖల కార్యాలయాలున్నాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది, వాయుసేన, సైన్యం సాయంతో 14 గంటలకు పైగా కష్టపడి మంటలను అదులోకి తెచ్చారు. అయితే, భవనంలో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో అక్కడికి కొద్ది దూరంలో ఓ ఆధునిక ఫైర్‌ ఇంజిన్‌ నిలిపి ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ ఫైర్‌ ఇంజిన్‌ను సకాలంలో ఉపయోగించి ఉంటే మంటలు మరింత త్వరగా అదుపులోకి వచ్చేవని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

తొమ్మిది నెలల క్రితం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ. 5.5 కోట్లతో అత్యాధునిక హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ను కొనుగోలు చేసింది. దీని సాయంతో అగ్నిమాపక సిబ్బంది 18 అంతస్తుల వరకు సునాయాసంగా చేరుకోవచ్చు. కానీ, స్థానిక ఆర్టీఏ అధికారుల నుంచి ఈ ఫైర్‌ ఇంజిన్‌కు అనుమతులు రాకపోవడంతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దీన్ని ఉపయోగించలేకపోతున్నట్లు ఫైర్‌ సిబ్బంది వెల్లడించారు. అలానే, ఈ హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ను వినియోగంపై సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడం దీన్ని పక్కన పెట్టడానికి మరో కారణంగా చెబుతున్నారు. దీనిపై మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో దాన్ని ఉపయోగించలేదని చెప్పారు. ఇకపై పెద్ద భవనాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు సరిపడా దారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఆదేశించినట్లు తెలిపారు. 

సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో సాత్పురా భవనంలోని మూడో అంతస్తులో ఆదివాసీ సంక్షేమశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌ కండిషనర్లు, గ్యాస్‌ సిలిండర్లకు మంటలు తాకడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. మంటలు మరో మూడు అంతస్తులకు వ్యాపించడంతో ఆరోగ్యశాఖకు చెందిన అత్యంత కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ చారి మిశ్రా మాట్లాడుతూ.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని