Amritpal Singh: అమృత్‌పాల్‌ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్‌ లొంగుబాటు

చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అతడి కోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మరంగా అన్వేషణ సాగిస్తున్నారు. మరోవైపు అతడి మద్దతుదారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు.

Updated : 20 Mar 2023 11:58 IST

చండీగఢ్‌: పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) కోసం పంజాబ్‌ పోలీసుల (Punjab Police) వేట మూడో రోజు కొనసాగుతోంది. రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానంగా ఉన్న ప్రతి వాహనాన్ని ముమ్మరంగా సోదా చేస్తున్నారు. మరోవైపు, అమృత్‌పాల్‌ మామ హర్జిత్‌ సింగ్‌, డ్రైవర్‌ హరప్రీత్‌ సింగ్‌ నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జలంధర్‌ రూరల్‌ సీనియర్‌ ఎస్పీ స్వరణ్‌ దీప్‌ సింగ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు 112 మంది అమృత్‌పాల్‌ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు మొబైళ్లలో ఇంటర్నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సేవల నిలుపుదల ఆంక్షలు మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ఖలిస్థానీ దుశ్చర్య.. భారీ పతాకంతో భారత హైకమిషన్‌ జవాబు..

అమృత్‌పాల్‌ (Amritpal Singh) వ్యవహారం నేపథ్యంలో ఖలిస్థానీ అనుకూలవాదులు యూకేలో దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. లండన్‌ (London)లోని భారత్‌ హైకమిషన్‌ను ముట్టడించి.. ఆ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను కిందికి దింపేసి అగౌరవ పర్చారు. ఈ ఘటనతో యూకే ప్రభుత్వంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. నిరసనకారులు భారత హైకమిషన్‌ (Indian High Commission)కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన అనంతరం దౌత్య కార్యాలయంపై హైకమిషన్‌ సిబ్బంది భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు.

స్పందించిన యూకే ప్రభుత్వం..

ఈ పరిణామాల నేపథ్యంలో యూకే (UK) ప్రభుత్వం స్పందించింది. భారత హైకమిషన్‌ సిబ్బంది భద్రతపై తాము తీవ్రంగా దృష్టి సారిస్తున్నామని, వారికి ఎల్లప్పుడూ భద్రత కల్పిస్తామని యూకే విదేశాంగ మంత్రి తారిక్‌ అహ్మద్‌ వెల్లడించారు. అటు బ్రిటిష్‌ అధికారులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఖలిస్థానీ దుశ్చర్యపై లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ తరహా విధ్వంసానికి మా నగరంలో చోటు లేదు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తెలిపారు. భారత్‌కు బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఇది అమర్యాదకర, ఆమోదయోగ్యం కానీ చర్య’’గా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని