Kamal Nath: ‘జోడో యాత్రతో చచ్చిపోతున్నాం!’.. కమల్‌నాథ్‌ వీడియో వైరల్‌

కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర షెడ్యూల్‌పై ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్ అసహనం ప్రదర్శించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 01 Dec 2022 16:16 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సహా పలువురు రాష్ట్ర నేతలు ఈ యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జోడో యాత్ర’ కఠిన షెడ్యూల్‌పై కమల్‌నాథ్ అసహనం ప్రదర్శిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది. దీంతో ఇది కాస్తా కాంగ్రెస్‌ పార్టీని కొత్త ఇబ్బందుల్లో పడేసింది.

ఆ వీడియోలో కమల్‌నాథ్.. ప్రదీప్‌ మిశ్రా అనే పండితుడితో మాట్లాడుతున్నారు. ‘‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. దాంట్లో రెండు నిబంధనలుంటాయి. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 కిలోమీటర్లు నడవాలి’’ అని మాజీ సీఎం చెబుతున్నారు. అంతేగాక, మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్‌ మూడు ప్రీ కండిషన్లు పెట్టారని కమల్‌నాథ్‌ అన్నారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్‌ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని రాహుల్ షరతు పెట్టారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని స్థానిక మీడియా సంస్థలు సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా.. మధ్యప్రదేశ్‌ జోడో యాత్రలో కమల్‌నాథ్.. రాహుల్‌ వెంటే ఉన్నారు. రాహుల్‌తో కలిసి ఓంకారేశ్వర, ఉజ్జయిని మహంకాళీ ఆలయాలను దర్శించుకున్నారు.

ఇది కాస్తా భాజపాకు ఆయుధంగా మారింది. దీనిపై భాజపా మంత్రి నరోత్తమ్‌ మిశ్రా స్పందిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కమల్‌నాథ్‌ జీ. మీ వీడియో చూశాను. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని యాత్రలో పాల్గొనేలా రాహుల్ బలవంతపెట్టొద్దని ప్రార్థిస్తున్నా. మీ యాత్ర ఎవరికీ హాని కలగకుండా చూసుకోండి’’ అని మిశ్రా దుయ్యబట్టారు. ఇటీవల.. భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న కొందరు సీనియర్‌ నేతలు కూడా నడుస్తూ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగానే అలా జరిగిందని కాంగ్రెస్‌.. భాజపాపై విమర్శలు చేయడం గమనార్హం.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు