Rahul Gandhi: ట్విటర్‌ బయోను మార్చిన రాహుల్‌

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన ట్విటర్‌ బయోను మార్చారు. దీంతోపాటు ఆయనపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేపడుతోంది.  

Published : 26 Mar 2023 18:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై వేటుపడ్డాక దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌-భాజపా మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. రాహుల్‌(Rahul Gandhi) పార్లమెంట్‌ సభ్యత్వంపై వేటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది.  ఈ క్రమంలో సామాజిక మాధ్యమం ట్విటర్‌(Twitter )లోని రాహుల్‌గాంధీ ఖాతా బయోలో ఆదివారం మార్పులు చోటు చేసుకొన్నాయి. దీనిలో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడిని అన్న ఆయన ‘డిస్‌క్వాలిఫైడ్‌ ఎంపీ’ అని చేర్చారు. 2019లో ‘మోదీ అనే ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు’ సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 

కాంగ్రెస్‌ సంకల్ప యాత్ర..

రాహుల్‌ గాంధీకి మద్దతుగా ఆదివారం నుంచి కాంగ్రెస్‌ పార్టీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి సంకల్ప్‌ యాత్రను ప్రారంభించింది. పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్‌ నాయకులు కేసీ వేణుగోపాల్‌, పి.చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌లు రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహం చేశారు. జైరాం రమేష్‌, ముకుల్‌ వాస్నిక్‌, పవన్‌కుమార్‌ బన్సల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దిల్లీలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 

దిల్లీపోలీసులు రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించారు. తగినంత భద్రతా ఏర్పాట్లు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. దీనిపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నాయకుడు కేసీ వేణుగోపాల్‌ ట్విటర్‌లో స్పందిస్తూ ‘‘పార్లమెంట్లో మా గొంతు నొక్కిన ప్రభుత్వం ఇప్పుడు గాంధీ సమాధి వద్ద సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించింది. ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతులు నిరాకరించడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఇది మమ్మల్ని అపలేదు. న్యాయం కోసం జరిగే మా పోరాటం ఆగదు’’ అని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని